టెన్త్ మూల్యాంకనంకు
తొలిరోజు 80 శాతం మంది హాజరు
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
పరిశీలకులుగా జాయింట్ డైరెక్టర్ శైలజ
అన్ని సదుపాయాలు కల్పించామన్న డీఈఓ
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. పల్నాడురోడ్డులోని కేబీఆర్ విద్యాసంస్థల ప్రాంగణంలో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేశారు. మూల్యాంకనంలో పాల్గొనేందుకు 725 మంది ఉపాధ్యాయులను నియమించారు. అనారోగ్యం తదితర కారణాలతో తొలిరోజు 80 శాతం మంది హాజరు కాగా, మరికొందరికి మంగళవారం హాజరు కావాలని నియామక పత్రాలు అందచేశారు. మూల్యాకనంలో 73 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 432 మంది ఎగ్జామినర్లు, 220 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. కేంద్రంలో 24 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కేంద్రం పరిశీలకులుగా పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ పి.శైలజ హాజరై మూల్యాంకనం జరుగుతున్న తీరు, సదుపాయాలను పరిశీలించారు.
ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు..
ప్రశాంత వాతావరణంలో మూల్యాంకనం కొనసాగేలా కేంద్రంలో ఉపాధ్యాయులకు అన్ని సదుపాయాలు కల్పించినట్టు డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. తాగునీరు, నిరంతర విద్యుత్ సదుపాయం, ఫ్యాన్లు, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేశామన్నారు. వైద్య సిబ్బందితో పాటు 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు.


