చిలకలూరిపేట: పీఆర్‌సీ కమిషన్ చైర్మన్‌ను వెంటనే నియమించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ దశల వారీ పోరాటంలో భాగంగా యూటీఎఫ్ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద రణభేరి పేరుతో ఒక రోజు నిరాహార దీక్ష మంగళవారం నిర్వహించారు. శిబిరాన్ని ఏపీ ఎన్‌జీవో సంఘం తాలూకా అధ్యక్షుడు బి. హనుమంతనాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 29శాతం ఐఆర్‌ను, డీఏలను ప్రకటించాలని కోరారు. హెల్త్ కార్డుల మెడికల్ బిల్ సమస్యలను పరిష్కరించాలన్నారు. 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. కోవిడ్ సమయంలో మరణించిన 953 మంది పంచాయతీరాజ్ ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్ష అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు టి. సుధాకరహరిప్రసాద్, వై. చిట్టిబాబు, డి. సుజాత, కె. అరుణ, షేక్ మొహమ్మద్ యాసిన్, ఐ. సునీత, వి. నాగేశ్వరరావు, టి. బాలరాజు, షేక్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
కె.శ్రీనివాసరెడ్డి


