మాచర్ల: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క వైఎస్సార్‌సీపీ నాయకుడు, కార్యకర్తల పై ఏదో విధంగా అక్రమ కేసులు పెడుతున్నారని, దీనిని దీటుగా ఎదుర్కొని పార్టీ క్యాడర్‌ను కాపాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, నాతో పాటు మీ అభిమాన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌లు అండగా నిలబడతామని పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు, మల్లపాలెం తిరునాళ్లలో పీఆర్కే, యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌లకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఆర్కే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుందని, అయినా హామీలు అమలుపర్చకుండా రెడ్‌బుక్ రాజ్యాంగమంటూ అక్రమ కేసులు పెట్టి అందరినీ వేధిస్తున్నారన్నారు. ఇందుకు మూల్యం చెల్లించాల్సిన పరిస్ధితి వస్తుందన్నారు. రెండేళ్లు ఓపిక పట్టండి మేమంతా అండగా ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మేము కాపాడుకుంటాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. రాబోయే రోజుల్లో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం, డిజిటల్ బుక్‌లో మీరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని ఎక్కించండి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా చూస్తాం. చట్టపరమైన పోరాటాన్ని చేసి ప్రతి ఒక్కరి హక్కు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామంలో వచ్చినప్పటి నుంచి వీడ్కోలు పలికే వరకు చంద్రశేఖర్, పీఆర్కేకు జేజేలు పలుకుతూ తిరునాళ్ళ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా వారు స్వామి వార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వీరి వెంట యర్రగొండపాలెం వైఎస్సార్‌సీపీ నాయకులు, పుల్లలచెరువు మండలం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.


