నరసరావుపేట: జిల్లాలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లోని గుర్రం జాషువా మీటింగ్ హాలులో సాంస్కృతికశాఖ, ధర్మాదాయ, దేవదాయ శాఖల ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు. ఉగాది పంచాగం విని పచ్చడిని సేవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియచేశారు. ఉగాది పచ్చడి మాదిరిగా జీవితంలో కూడా సుఖం, దుఃఖం ఉంటాయని చెప్పారు. అన్నీ అధిగమించే శక్తి ఆ దేవుడు అందరికీ ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని ప్రదర్శించిన ఓక్‌ల్యాండ్ స్కూలు, పలు సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను అభినందించారు. మాజీ ప్రిన్సిపాళ్లు, సాహితీవేత్తలైన చేరెడ్డి మస్తాన్‌రెడ్డి, శ్రీవేదాంతం శ్రీనివాస అయ్యంగార్, మేళ్లచెరువు భానుప్రసాదులతో పాటు ఎనిమిది మంది ప్రముఖులను శాలువాలతో సత్కరించి, షీల్డు అందజేశారు. ప్రత్యేక ఉగాది డైరీని ఆవిష్కరించారు. ఆటోవర్కర్స్ తీసుకొచ్చిన కేకును కట్ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నారదముని, ధర్మాదాయశాఖ అధికారి దుర్గారావు, గురజాల ఆర్‌డీఓ మురళి, తహసీల్దార్ వేణుగోపాలరావు పాల్గొన్నారు.


