భక్తులకు గంధం పంపిణీ చేసిన నిర్వాహకులు సాయంత్రం నాలుగు గంటల వరకు గ్రామోత్సవం
పెదకాకాని: బాజీబాబా దర్గా రెండు రోజుల ఉరుసు మహోత్సవం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలతో ముగిసింది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్‌బోర్డు అధికారులు మహ్మద్ హుస్సేన్, దర్గా ఈఓ షేక్ ఖాజావలిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా ఉరుసు మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో భాగంగా పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందినీ అలంకరణలో గంధం బిందెలతో గురువారం రాత్రి ప్రారంభమైంది. బాజీబాబా వారి గుర్రం శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకూ వెనిగండ్ల, పెదకాకాని గ్రామ పురవీధులలో గ్రామోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు బాజీబాబా వారి గుర్రానికి మిఠాయిలు, పండ్లు తినిపించారు. కొబ్బరికాయలు, పూలు, గంధం సమర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. బాబావారి గుర్రం దర్గాలోకి చేరుకోగాలనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భక్తులకు గంధం పంపిణీ చేశారు. గంధం పంపిణీ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో రద్దీ వాతావరణం నెలకొంది. భక్తులందరికీ గంధం పంపిణీ జరిగిందని వక్ఫ్‌బోర్డు ఈఓ షేక్ ఖాజావలి తెలిపారు.


