భృతి భ్రమ.. కొలువు మమ! | - | Sakshi
Sakshi News home page

భృతి భ్రమ.. కొలువు మమ!

Mar 21 2026 5:03 AM | Updated on Mar 21 2026 5:03 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ పోస్టులు 90 వేలు

గతంలో అసెంబ్లీలో స్వయంగా

ప్రకటించిన ప్రభుత్వం

ఇప్పుడు 10 వేల పోస్టులతోనే జాబ్‌ క్యాలెండర్‌

చంద్రబాబు సర్కార్‌పై మండిపడుతున్న నిరుద్యోగులు

అమలుకు నోచుకోని నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి

ప్రతి నెలా జిల్లాలో నిరుద్యోగులకు రావాల్సిన మొత్తం రూ. 156.90 కోట్లు

జిల్లాలో 5.23 లక్షలకు పైగానే నిరుద్యోగులు

నిరుద్యోగులకు అన్యాయం

సత్తెనపల్లి: చదువుకున్నారక ఉద్యోగాలు రాక వేలాది మంది నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకపోతే ప్రతి నెలా రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు .. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం మానేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన తనయుడు నారా లోకేష్‌ యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్రలో ఉద్యోగ అవకాశాలపై పలుచోట్ల హామీలు ఇచ్చారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని గొప్పలు చెప్పారు. తీరా చూస్తే అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలు తొలగించడం తప్ప కొత్తగా ఇవ్వడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. ఇచ్చేది గోరంత .. ప్రచారం కొండంత అన్నట్టుగా ఉంది ప్రభుత్వ తీరు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పారు.ఒక ఏడాది గడిచిపోగా .. రెండో ఏడాది కేవలం 10 వేల పోస్టులతో అరకొరగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో 5.23 లక్షల మందికిపైగా..

ఉగాదికి కొత్త జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసింది. అసెంబ్లీ సాక్షిగా 90 వేలకుపైగా ఖాళీ పోస్టులు ఉన్నట్లు గతంలో ప్రకటించింది. తీరా చూస్తే అన్ని విభాగాల్లో ఉన్న వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కేవలం 10 వేల పోస్టులతో మాత్రమే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 20.42 లక్షలు. జిల్లా వ్యాప్తంగా 5.23 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికొకరు చొప్పున లెక్క వేసిన జిల్లాలో 5.23 లక్షల మందికిపైగానే నిరుద్యోగులు ఉన్నారు. రాష్ట్రమంతటికీ కలిపి కేవలం 10 వేల పోస్టులతో మాత్రమే ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికల హామీ మేరకు ఉద్యోగం ఇవ్వకపోగా.. కనీసం రూ. 3 వేల భృతి వరకే తీసుకున్నా ప్రతి నెలా ప్రభుత్వం రూ. 156.90 కోట్లకు పైగా చెల్లించకపోవడంపై కూడా నిరుద్యోగులు నిరసన గళం వినిపిస్తున్నారు.

సుదూర ప్రాంతాలకు వలస బాట...

చదువుకున్నా ఇక్కడ ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో అనేక మంది యువతీయువకులు తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు, ముంబై వంటి సుదూర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వలస పోవాల్సి వస్తోంది. గుంటూరులోని ఉమ్మడి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యాన కొన్నేళ్లుగా ప్రభుత్వ నియామకాలు జరగడమే లేదు. వాటిల్లో నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చాలామంది ప్రైవేట్‌ సంస్థల్లో చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు.

ఎన్నికల వేళ ‘బాబు ష్యూరిటీ – జాబ్‌ గ్యారెంటీ’ అంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు.. అధికారం చేపట్టిన తర్వాత యువతను నట్టేట ముంచారు. టీడీపీ సర్కార్‌ కొలువుదీరి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. ఉగాదికి జాబ్‌ క్యాలెండర్‌ అంటూ ఊరించారు. ఇప్పుడు పదివేల పోస్టులతో సరిపెడుతూ నిరుద్యోగులను సర్కార్‌ మోసం చేస్తోంది. ఈ క్రమంలో కనీసం నిరుద్యోగ భృతి అమలు చేస్తారని ఎదురు చూస్తున్న యువతకు కూడా

మొండిచేయి చూపుతోంది.

రాష్ట్రంలో లక్షలాది ఖాళీలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా భర్తీ చేయకుండా కేవలం కొద్ది పోస్టులతో పరిమితమవడం నిరుద్యోగులకు అన్యాయం చేయడమే. ఇంటికో ఉద్యోగం లేకపోతే నెల నెలా రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేదంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం.

–కోట సాయికుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌, పల్నాడు

జాబ్‌ కావాలంటే బాబు రావాలని, తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోగా .. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులను తొలగించారు. వలంటీర్లు, ఉపాధి హమీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న వారు, ఏపీ ఫైబర్‌ నెట్‌, ఏపీఎండీసీ కాంట్రాక్ట్‌ వర్కర్లు, యానిమేటర్లు, విద్యుత్‌ మీటర్‌ రీడర్లు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో ఆపరేటర్లు, ఆశా కార్యకర్తలు, స్కూల్‌ ఆయాల వంటి వారు వీరిలో ఉన్నారు. వీరందరూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వలంటీర్లకు రూ. 5 వేలు కాకుండా, రూ. 10 వేలు ఇస్తామన్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల హామీ గాల్లో కలసిపోయింది. వలంటీర్లను చివరకు రోడ్డుపైకి నెట్టేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement