దీక్ష ముగిసె .. దువా ఫలించే | - | Sakshi
Sakshi News home page

దీక్ష ముగిసె .. దువా ఫలించే

Mar 21 2026 5:03 AM | Updated on Mar 21 2026 5:03 AM

జిల్లావ్యాప్తంగా సర్వం సిద్ధం...

నేడే ఈద్‌ ఉల్‌ ఫిత్ర్‌

ముగిసిన ఉపవాసాలు

జిల్లా వ్యాప్తంగా ఈద్‌ నమాజ్‌

ఈద్గాలు, మసీదుల్లో భారీ ఏర్పాట్లు

ధన, ఆరోగ్యాలకు బీమా జకాత్‌

పేదలూ పండుగ చేసుకునేందుకు ఫిత్రా

సత్తెనపల్లి: పవిత్ర రంజాన్‌ మాసం నేటితో ముగియనుంది. శుక్రవారం సాయంత్రం చంద్ర వంక దర్శనంతో ముస్లింలు ఈద్‌ నమాజ్‌కు సిద్ధమయ్యారు. శనివారం ఈద్‌–ఉల్‌–ఫితర్‌ పండగ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు (రోజా), ప్రత్యేక తరావీహ్‌ నమాజ్‌, సహర్‌, ఇఫ్తార్లు, ఖురాన్‌ పఠనం, దానధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముస్లింలు గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చుక్క నీరు తాగకుండా నిష్టతో దీక్షలు పాటించారు. చివరకు నెల వంక దర్శనం కావడంతో పండుగ చేసుకోనున్నారు. ఈదుల్‌ ఫితర్‌ నమాజ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. ఈద్గాలతోపాటు మసీదుల్లో సౌకర్యాలు కల్పించారు. పండుగ రోజు ముస్లింలు ఈద్గాలకు వెళ్లి ఈదుల్‌ ఫితర్‌ నమాజ్‌ చేయడం ఆనవాయితీ. నెల రోజులు తమ నమాజులు ఫలించాలని, సర్వ మానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ అల్లాహ్‌కు దువా చేస్తారు.

2.50 శాతం జకాత్‌

రంజాన్‌లో దానధర్మాలకు అధిక ప్రాధాన్యం ఉంది. మనిషి ఆరోగ్యం, తాను సంపాదించిన ధనం పై అల్లా నిర్దేశించిన బీమాయే జకాత్‌, ఫిత్రా దానాలు. 52.5 గ్రాముల వెండి, 75 గ్రాముల బంగారం, అంతకుమించి విలువైన ధన, ఆస్తులు కలిగితే జకాత్‌కు అర్హులు. వాటి వెల లెక్క కట్టి 2.5 శాతం పేదలకు జకాత్‌ రూపేణ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రంజాన్‌లో ఇస్తే 72 రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుందనేది ముస్లింల విశ్వాసం.

ఫిత్రా ఇవ్వాల్సిందే ..

సాధారణ ముస్లిం రంజాన్‌ సందర్భంగా 2.6 కిలో గ్రాముల గోధుమలు, వరి (ప్రధాన ఆహార ధాన్యం), సమానమైన డబ్బు పేదలకు దానం చేయడమే ఫిత్రా. దీనిని ఆరోగ్య బీమాగా మత పెద్దలు చెబుతారు. పేదరికంతో పండగకు నోచుకోని నిరుపేద ముస్లింలకు ఫిత్రా దానం ఇవ్వాలి. సద్‌ఖా–ఎ–ఫిత్రాతో ఆరోగ్య బీమాను అల్లాహ్‌ కల్పిస్తారంటారు. సూత్రప్రాయంగా ఈ ఏడాది మత పెద్దలు రూ. 105 ఫిత్రా ఇవ్వాలని సూచించారు. దీని కంటే ఎక్కువ ఇవ్వవచ్చు. కానీ తగ్గించరాదు. పండుగకు కనీసం ఒకరోజు ముందే ఫిత్రా చెల్లిస్తే పేదలు సైతం పండగ చేసుకునే వీలుంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరున ఫిత్రా ఇవ్వాలి.

అల్లా ఇంటి ఆతిథ్యం ఎతెకాఫ్‌

ఎతెకాఫ్‌ అల్లా ఇంటి (మసీదు) ఆతిథ్యం వంటిది. రంజాన్‌లో దీనికెంతో ప్రాధాన్యం ఉంది. ఊళ్లో0 ఒక వ్యక్తి కూడా ఎతెకాఫ్‌ ఉండకపోతే, ఆ ఊరిపై అల్లా కరుణ, కటాక్షాలు ఉండవని పవిత్ర ఖురాన్‌ బోధిస్తోంది. ఎతెకాఫ్‌ను రంజాన్‌ చివరి పది రోజుల్లో పాటించాలి. ప్రాపంచిక జీవితానికి దూరంగా, వీలుపడిన రోజులు (కనీసం 24 గంటలు) మసీదులో అల్లా ధ్యానంలో గడపడమే ఎతెకాఫ్‌. అన్నిటినీ త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే వానిపై అల్లాహ్‌ అత్యంత కరుణతో మొర ఆలకిస్తారని మౌల్వీలు అంటున్నారు.

సామూహిక నమాజులకు ముందు మహా ప్రవక్త మొహమ్మద్‌ సంప్రదాయ ప్రకారం ఖర్జూరం సేవించి, నూతన వస్త్రాలు ధరించి, అత్తరు రాసుకొని నమాజు కోసం ఈద్గాకు చేరుకుంటారు. అక్కడ ఈద్‌ నమాజు చదివి, అనంతరం పరస్పరం ఈద్‌ ముబారక్‌ చెప్పుకొంటారు. అల్లాహ్‌ నామాన్ని స్మరిస్తూ ఇంటి నుంచి ఇద్గాకు వెళ్లి, నమాజ్‌ పూర్తయ్యాక వేరే మార్గంలో ఇంటికి చేరుతారు. రంజాన్‌లో సేమియా పాయసం ప్రత్యేకం. బంధుమిత్రులకు ఇరుగుపొరుగు వారికి సేమియా పాయసం ఇచ్చి తమ ఆత్మీయతను పంచుకుంటారు. చిన్నపిల్లలకు ఈద్‌ కానుకలు బహూకరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement