తెనాలిఅర్బన్: తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను కాయల్ప బృందం మంగళవారం సందర్శించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నిర్మలా గ్లోరి, క్వాలిటీ మేనేజర్ వాసుబాబు, క్వాలిటీ కన్సల్టెంట్ వాసు రాజు తతదితరులు ఆసుపత్రిలోని పలు వార్డులు, ఓపీ సేవలు, ల్యాబ్, రేడియాలజీ తదితర విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి పలువురు అభిప్రాయాలు తెలుసుకున్నారు. సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్డర్ సౌభాగ్యవాణి, ఆర్.ఎం.వో డాక్టర్ మల్లిఖార్జునరావు, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెనాలిరూరల్: తల్లి మందలించిందన్న కారణంలో కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అంగలకుదురు గ్రామానికి చెందిన మన్నవ తిరుపతయ్య(35) బేలుదారు పనులు చేస్తుంటాడు. పనికి వెళ్లగా వచ్చిన డబ్బుంతా మద్యంకే వాడేస్తుండడంతో తల్లి సోమవారం మందలించింది. మనస్థాపానికి గురై పురుగులమందు తాగిన అతన్ని కుటుంబ సభ్యులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్‌ఐ కె. ఆనంద్ తెలిపారు. మృతుడి భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి.
వేటపాలెం: బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడు పిట్ల సూరిబాబుకు 10 ఏళ్ల జైలు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఒంగోలు పీఓసీఎస్ కోర్టు న్యాయమూర్తి కె. శైలజ మంగళవారం తీర్చు ఇచ్చారు. 2025లో ఓ బాలికపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడి పై నేరం రుజువు కావడంతో జడ్జి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమానా విధించారు. బాలిక తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 వేలు నగదు పరిహారం కింది చెల్లించాలని తీర్పులో వెల్లడించారు. కేసు దర్యాప్తును వేగవంతంగా నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేసి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్న పోలీస్ అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు అభినందించారు.


