సత్తెనపల్లి(ముప్పాళ్ళ): నివాసాల మధ్య వైన్ షాప్ (మద్యం దుకాణం) వద్దు బాబోయ్... వద్దంటూ సత్తెనపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య మహిళలు మంగళవారం కదం తొక్కారు. గుడి, బడికి దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆదేశాలను లెక్కపెట్టకుండా గృహాల మధ్య దుకాణం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేయటం ఏంటని నిలదీశారు. గుడికి వెళ్లే వారికి రక్షణ కల్పించాలంటూ ప్ల కార్డులతో రోడ్డెక్కారు. వైన్‌షాప్ ఏర్పాటు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, త్వరలో మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పట్టణంలోని గార్లపాడు బస్టాండ్ ఏరియా గీతామందిరం ఎదురుగా వైన్‌షాప్ ఏర్పాటుకు సిద్ధమవుతుండటంతో స్థానికులు ఆందోళన బాటపట్టారు. వైన్‌షాప్ నిర్వహించే స్థలం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్ల కార్డులతో నిరసనగా గడియారం స్తంభం వద్దకు చేరి మానవహారంగా ఏర్పడ్డారు. రక్షణ కల్పించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వైన్‌షాప్ ఏర్పాటు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిప్రం అందించామని, మంగళవారం స్థానిక ఎమ్మెల్యేను కలిసి కలిగే ఇబ్బందులను వివరించామని ఆర్యవైశ్య మహిళలు, ప్రాంత వాసులు తెలిపారు. సమస్యపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని మహిళలు తెలిపారు.


