కారెంపూడి: మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలోని పొట్టి శ్రీరాములు కాలనీలో నందమూరి తారక రామారావు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను తాత్కాలికంగా తొలగించి పక్కన పెట్టి మరలా పునరుద్ధరణ చేసుకోవాలని మంగళవారం చేపట్టిన కార్యక్రమం వివాదంగా మారి ఉద్రిక్తతలకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ కాలనీ నాయకులు వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడానికి వీల్లేదని అడ్డుతగలడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కాలనీ కూడలిలో ప్రధాన రహదారి పక్కనే కల్యాణ మండపం నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ పనులకు వైఎస్సార్, ఎన్టీఆర్ విగ్రహాలు అడ్డుగా ఉన్నాయని వాటిని తాత్కాలికంగా తీసి పక్కన పెట్టి నిర్మాణం పూర్తయ్యాక ఏర్పాటు చేసుకుందామనే ఆలోచనతో కాలనీ యువకులు ఒక అవగాహనకు వచ్చారని సమాచారం. ఈ క్రమంలోనే విగ్రహాలను పక్కన పెట్టే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని జేసీబీతో తొలగించి పాఠశాల ఆవరణలో పెట్టారు. తర్వాత వైఎస్సార్ విగ్రహం తొలగింపును కాలనీ వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. తాము విగ్రహం తొలగింపునకు అంగీకారం తెలపలేదని, తీయడానికి వీల్లేదని ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం పోలీసు అధికారుల దృష్టికి వెళ్లింది, దీంతో సీఐ శరత్‌బాబు, ఎస్‌ఐ వాసులు తక్షణం స్పందించి విషయాన్ని పై అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్ధితిని చక్కదిద్దారు. దీంతో వైఎస్సార్ విగ్రహం తొలగింపు కార్యక్రమం ఆగిపోయింది. గ్రామంలో ఉద్రిక్తతలు కూడా తగ్గాయి.
వైఎస్సార్ విగ్రహం తొలగింపును
అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు


