ప్రజలకు చెప్పిన పనులు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు చెప్పిన పనులు చేయాలి

Mar 18 2026 11:10 AM | Updated on Mar 18 2026 11:10 AM

● జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ● రామాపురంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ

దాచేపల్లి : పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయసేకరణ సభలో ప్రజలకు చెప్పిన పనులన్నీ తప్పనిసరిగా చేయాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా అన్నారు. మండలంలోని గామాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆంధ్రా సిమెంట్స్‌ ఫ్యాక్టరీ రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో 191 హెక్టారులలో లైమ్‌స్టోన్‌ ఉత్పత్తి కోసం ప్రజాభిప్రాయ సేకరణ సభను రామాపురంలో మంగళవారం నిర్వహించారు. రామాపురం, శ్రీనగర్‌, గామాలపాడు గ్రామాలకు చెందిన ప్రజలు సభలో వారి సమస్యలపై చర్చించారు. ఫ్యాక్టరీ విస్తరణకు తాము వ్యతిరేకం కాదని, ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కోరారు. ఫ్యాక్టరీలో చేస్తున్న భారీ బ్లాస్టింగ్స్‌ వల్ల గృహాలు దెబ్బతింటున్నాయని, ఇళ్లకు నష్టపరిహారం చెల్లించటంతో పాటుగా కనీస భద్రత చర్యలు తీసుకోవాలని పలువురు చెప్పారు. సీఎస్సార్‌ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలని, ప్రజాభిప్రాయ సేకరణ సభలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలన చేసి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ.. పరిశ్రమ విస్తరణ కోసం ప్రజల నుంచి వినతులు స్వీకరించామని, వీటన్నింటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికగా పంపిస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం సహకరించిన ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి జరిగేలా యజమాన్యం చర్యలు తీసుకోవాలని, సీఎస్సార్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఫ్యాక్టరీ వైస్‌ ప్రెసిడెంట్‌ సుబ్బారావు మాట్లాడుతూ.. తమ యజమాన్యం ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.

ఈ సభలో కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, భూగర్భ గనులశాఖ సహయ సంచాలకులు ప్రకాష్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement