రొంపిచర్ల: ఓ వితంతువు కిడ్నాప్‌నకు యత్నించిన సంఘటన మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరేపల్లి ముప్పాళ్ళకు చెందిన ఓ మహిళ నరసరావుపేటలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. రోజుమాదిరిగా డ్యూటీ ముగించుకొని ద్విచక్ర వాహనంపై స్వగ్రామం బయలుదేరారు. పరిస్థితిని గమనించిన గుర్తు తెలియని వ్యక్తి మోటారు సైకిల్‌పై వెంబడించాడు. తుంగపాడు గ్రామ సమీపంలోకి వెళ్లగానే బండి అడ్డుపెట్టాడు. వాహనం వెనుక ఏదో అడ్డుపడుతుందని ఆమెకు చెప్పాడు. అప్పటికే ఆమె బంధువులతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంది. ఆ మహిళ దిగి బండి వెనుక భాగం చూడబోగా ఆ దుండగుడు ఆమె చేతికి ఉన్న ఉంగరాలను లాక్కున్నాడు. అదే మార్గంలో వేరే వారు వస్తుండటంతో దుండగుడు ఆమెను రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి లాక్కెళ్లాడు. జరుగుతున్న సంఘటనను ఫోన్‌లో గమనించిన బంధువులు వెంటనే షాపువారికి, ఆమె బంధువులకు తెలియజేశారు. వారు వెంటనే 100కు సమాచారం అందించటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుండగుడు ఆమెను మరి కొంత దూరం పొలంలోకి లాక్కెళ్లి పరారయ్యాడు. ఆ మహిళ సంతగుడిపాడు సమీపంలోని కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వే పైకి చేరుకొని రొంపిచర్లకు వచ్చారు. ఆమె సురక్షితంగా చేరుకోవటంతో బంధువులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ లోకేశ్వరరావు తెలిపారు.


