ధర్నా చేసి జేసీకి వినతిపత్రం అందజేసిన నాయకులు, రైతులు
నరసరావుపేట: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటు కంటే అదనంగా రెండున్నర రెట్లు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట భూములు కోల్పోతున్న రైతులతో ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ సంజనా సింహకు వినతిపత్రం అందజేశారు. గోపాలరావు మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అమరావతి మండలంలో రెండు గ్రామాలు, పెదకూరపాడు మండలంలో ఏడు గ్రామాలు కలిసి మొత్తం తొమ్మిది గ్రామాల్లో 990 మంది రైతుల నుంచి 648 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఈ రైతులంతా సన్న, చిన్న కారు రైతులు కావడంతో ఈ భూములే జీవనాధారం కావడం వలన, రైతులకు భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు న్యాయమైన పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పు 240 మీటర్లకు పెంచడం వల్ల సన్నా, చిన్నకారు రైతులు మరింతగా నష్టపోతున్నందున రింగురోడ్డు నిర్మాణం 70 మీటర్లు వెడల్పుతో మాత్రమే చేయాలని కోరారు. అదేవిధంగా 2013 భూ సేకరణ చట్టంలో గ్రామసభ జరిపి రైతుల అనుమతితో నష్టపరిహారం నిర్ధారణ చేయాలని, అటువంటి నిబంధనను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. రైతు సంఘం కూరపాడు మండల నాయకులు దర్శి శేషారావు, అమరావతి మండల రైతు నాయకులు బి.సూరిబాబు. పతకమూరి రాములు, ఆలపాటి వీరయ్య, వట్టికుంట అంకమరావు, విజయ్, భిక్ష మయ్య, నూతలపాటి సాంబశివరావు పాల్గొన్నారు.


