అనుమానంతో మహిళపై కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

అనుమానంతో మహిళపై కత్తితో దాడి

Mar 17 2026 7:32 AM | Updated on Mar 17 2026 7:32 AM

అనుమానంతో మహిళపై కత్తితో దాడి అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవు బైక్‌ ఢీకొని వృద్ధుడు మృతి ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల బీటెక్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

చినగంజాం: మహిళపై అనుమానంతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని మోటుపల్లి శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎస్సై శీలం రమేష్‌ వివరాల మేరకు.. ఒక మహిళతో మోటుపల్లి గ్రామానికి చెందిన పొగడదండ శ్రీనివాసరావు అనే వ్యక్తి గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో సదరు మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో సోమవారం ఉదయం మోటుపల్లి గ్రామ శివారు ప్రాంతంలో కత్తితో ఆమైపె దాడి చేసి హత్యాప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి వెళ్లి గాయాలపాలైన ఆమెను 108 వాహనంలో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు చినగంజాం ఎస్సై తెలిపారు.

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు

బాపట్లటౌన్‌: ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 59 మంది బాధితులు హాజరై వారి సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. బాధితుల సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్న ఎస్పీ సమస్యలను సాధ్యమైనంత త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్‌ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్‌ డీఎస్పీ పి.జగదీష్‌ నాయక్‌, పీజీఆర్‌ఎస్‌ సెల్‌ ఎస్‌.ఐ లక్ష్మీరాజ్యం, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వేటపాలెం: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వేగంగా దూసుకెళ్తున్న బైక్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన దేశాయిపేట పంచాయతీలోని మార్కెట్‌ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. చీరాలకు చెందిన బి.వెంకటరమణ(60) దేశాయిపేట మార్కెట్‌ వద్ద చీరాల–వేటపాలెం ప్రధాన రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో చీరాల వైపు బైక్‌పై వెళ్తున్న యువకుడు ఢీకొట్టడంతో వెంకటరమణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ నడుపుతున్న యువకుడికి సైతం తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ఉద్యోగోన్నతులకు సంబంధించి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ కేడర్ల వారీగా తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషా సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలిక, జనరల్‌ సీనియారిటీ జాబితాను సంబంధిత ఉపాధ్యాయుల అర్హతల ఆధారంగా సబ్జెక్టుల వారీగా డీఈవో.జీఎన్‌టీ.బ్లాగ్‌స్పాట్‌.కామ్‌లో ఉంచినట్లు తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సంబంధిత అధికారి ద్వారా తగిన ధ్రువపత్రాలతో ఈనెల 22లోపు సాయంత్రం 3.00 గంటల నుంచి 7 గంటల వరకు అన్ని పనిదినాల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని వినతుల స్వీకరణ కమిటీకి సమర్పించాలని సూచించారు. నిర్దిష్ట గడువు అనంతరం అందిన వినతులు స్వీకరించబడవని పేర్కొన్నారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో 2025 డిసెంబర్‌లో జరిగిన బీటెక్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఫస్ట్‌ సెమిస్టర్‌కు 925 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 795 మంది ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు రీవాల్యుయేషన్‌కు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి, రీవాల్యుయేషన్‌ దరఖాస్తులను 26వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్‌ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాలని, పర్సనల్‌ వెరిఫికేషన్‌కు రూ.2190 చెల్లించాలని ఆలపాటి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement