● జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ ● ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ కృష్ణారావు
నరసరావుపేట రూరల్: ఆర్థిక, భూ వివాదాలతో పాటు పలు రకాల మోసాలపై పీజీఆర్‌ఎస్‌లో అధిక ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పాల్గొని అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 88 ఫిర్యాదులు అందాయి. ఆర్థిక వివాదాలు–18, భూ వివాదాలు–18, భార్యభర్తల వివాదాలు–16తో పాటు బెదిరింపులు, ఆస్తినష్టం, కుటుంబ తగాదాలపై ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలను వేగంగా చట్టబద్దంగా పరిష్కరించేందుకు కృషిచేయాలని ఎస్పీ తెలిపారు. నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎస్‌ఐ బెదిరిస్తున్నారు..
లంచం తీసుకుని తమకు అన్యాయం చేశాడని ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన జాష్టి నాగజ్యోతి ఈపూరు ఎస్‌ఐ వేణగోపాల్ పై ఫిర్యాదు చేసింది. తమ ఇంటి స్థలంలో గోడను ఐదు నెలల క్రితం తాము నిర్మించుకున్నామని, అయితే ఈ గోడ వలన వాస్తుదోషం వస్తుందని పక్క ఇంటికి చెందిన గుర్రం బుచ్చారావు, విజయలక్ష్మి, నాగరత్నంలు తమపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎస్‌ఐ ఇరువురిని పిలిచి విచారించారని, మమ్మల్ని స్టేషన్‌లో కూర్చబెట్టిన ఎస్‌ఐ గోడను ఎప్పుడు పడేస్తారని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొండని దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని మీద మాట్లాడితే రౌడీషీట్ తెరుస్తానని బెదిరింపులకు దిగారని తెలిపారు. ఎస్‌ఐ అండతో గోడను కూల్చివేశారని వివరించారు. కూల్చిన గోడను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడ భవానీపురానికి చెందిన వ్యక్తి చెప్పిన మాటల నమ్మి రూ.2 లక్షలు మోసపోయినట్టు నరసరావుపేట పెదచెరువుకు చెందిన జంగటి సురేష్ ఫిర్యాదు చేశాడు. డీఎస్సీకి సిద్ధమవుతున్న తనకు విజయవాడకు చెందిన మాధవ సత్యనారాయణ పరిచయమై ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, ఇందుకు రూ.2లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేసి డబ్బులు వసూలు చేసిన సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
వీసా పేరుతో మోసం
పోలాండు దేశానికి వీసా ఇప్పిస్తానని గుంటూరుకు చెందిన కన్సల్టెన్సీ మోసం చేసినట్టు నరసరావుపేటలోని బరంపేటకు చెందిన మారం నాగార్జున బాబు ఫిర్యాదు చేసాడు. గ్రీస్‌లో ఉద్యోగం చేస్తున్న తన వీసా కాలపరిమితి ముగియడంతో విదేశాలకు వెళ్లేందుకు స్నేహితుడి ద్వారా కన్సల్టెన్సీని సంప్రదించినట్టు తెలిపాడు. అతని మాటలు నమ్మి పోలాండ్ పంపేందుకు రూ.1.20లక్షలు, వీసా కోసం రూ.1.20లక్షలు రెండు దఫాలుగా చెల్లించినట్టు ఫిర్యాదులో తెలిపాడు. వీసా ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదని, కన్సల్టెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు.
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ దోచుకున్నాడు
మాయ మాటలతో తన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రూ.16లక్షలు దోచుకున్నారని మాచర్ల మున్సిపల్ ఆఫీసు విశ్రాంత ఉద్యోగి బొగ్గవరపు చెన్నయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసాడు. మాచర్లకు చెందిన సుభాని చెప్పిన మాయమాటలు నమ్మి తన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌కు చెందిన రూ.16లక్షల చెక్కు అవ్వగా.. అతను తన ఖాతాకు బదిలీచేసుకున్నాడని తెలిపాడు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని పలు మార్లు అడిగినా స్పందించకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపాడు. మా కుమార్తె, అల్లుడిపై దాడికి కూడా పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.


