మాచర్ల రూరల్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు అందించకపోవటం దారుణమని, వెంటనే ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని పెన్షనర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాదె రామకృష్ణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పెన్షనర్స్ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 3.70లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిలు, క్వాంటం ఆఫ్ పెన్షన్స్ ఉత్తర్వుల గురించి ఎదురుచూస్తున్నారని, ఉత్తర్వులు విడుదల చేయటంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి తగదన్నారు. ఎన్నికల్లో ఓట్లు, సీట్లు కోసం హామీలిచ్చి నేటికీ అమలు చేయకపోవటం ఏటంటూ ప్రశ్నించారు. పీఆర్‌సీ కమిషన్ నియమించి 30శాతం ఐఆర్‌ను ప్రకటించటమే కాకుండా రావాల్సిన అన్నీ సౌకర్యాలను అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంఘం అధ్యక్షుడు నందా నరసింహయ్య మాట్లాడుతూ ఈహెచ్‌ఎస్ కింద పెన్షనర్లకు ఇచ్చిన హెల్త్ కార్డు వలన ఎటువంటి ప్రయోజనాలు లేకుండా పోతున్నాయని, బకాయిలు చెల్లించలేదనే సాకుతో ఆసుపత్రిలో వైద్యమందటం లేదని, వెంటనే మెడికల్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి వైద్యమందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చంద్రయ్య, ట్రెజరర్ గౌస్, సుబ్బారావు, ఆంజనేయులు, జాన్ సాహెబ్, నాగేశ్వరరావు, నాగార్జున, వెంకటేశ్వర్లు, లక్ష్మీకుమారి, పాపిరెడ్డి తదితరులున్నారు.
– పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణారావు


