జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ ప్రసాదు
నరసరావుపేట: ఒకసారి గ్యాస్ బుక్ చేసుకొని సిలిండర్ పొందిన తర్వాత మళ్లీ పట్టణంలో 25 రోజుల తర్వాత, గ్రామాల్లో 45 రోజుల తర్వాతనే గ్యాస్ బుక్ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం.వి.ప్రసాదు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం గ్యాస్ వినియోగంపై వినియోగదారులను అప్రమత్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయంతో వినియోగదారులు తమ వద్ద సిలిండర్ల గడువు ముగియక ముందే బుక్ చేస్తున్నారన్నారు. అటువంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దని వినియోగదారులకు సూచించారు. దీని వల్ల గతంలో 24 గంటలు లేదా 48 గంటలకు డెలివరీ చేసే గ్యాస్ పానిక్ బుకింగ్ వల్ల మూడు నుంచి ఆరు రోజులు సమయం పడుతుందన్నారు. ప్రతి మండలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలు ఏర్పాటు చేశామని, సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసినా, నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్రయించినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబరు 08647–252999ను సంప్రదించాలని సూచించారు.


