జిల్లాలో 128 పరీక్ష కేంద్రాలు 25,167 మందికిగాను 24,955 మంది విద్యార్థులు హాజరు 212 మంది గైర్హాజరు దూరవిద్య 1087 మందికిగాను 963 మంది హాజరు పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట ఈస్ట్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 128 పరీక్ష కేంద్రాలలో 25,167 మంది విద్యార్థులకుగాను 24,955 మంది హాజరయ్యారు. 212మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే 1087 మంది దూరవిద్య విద్యార్థులకుగాను 963 మంది హాజరు కాగా 124 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తీసుకున్న చర్యలను కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో సమస్యాత్మకంగా గుర్తించిన ఏడు పరీక్ష కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. పది పబ్లిక్ పరీక్షలు తొలిరోజు కావటంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన గదులు సరిచూసుకొని వెళ్లారు. ఉదయం 9 గంటల నుంచి విద్యార్థులను గదులలోకి అనుమతించారు.


