అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

Feb 3 2026 7:37 AM | Updated on Feb 3 2026 7:37 AM

అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

ఆస్తి కోసం ఇబ్బందులు పెడతున్నాడు తండ్రి ఆస్తిలో భాగం ఇప్పించండి పక్షవాతంతో బాధపడుతున్నా.. ఫించన్‌ ఇప్పించండి

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా పీజీఆర్‌ఎస్‌లో 110 అర్జీలు స్వీకరణ

నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించి 110 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్‌ను జాయింట్‌ కలెక్టర్‌ సంజన సింహతో కలిసి సందర్శించి కొందరి వద్ద నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి వారి సమస్య విన్నారు. అనంతరం జేసీ సంజన సంహ, మూడు డివిజన్ల ఆర్‌డీఓలు రెవెన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మొత్తం అర్జీలు 110 కాగా అందులో రెవెన్యూ క్లినిక్‌ ద్వారా 39 అర్జీలు ఉండగా వాటిలో గురజాల 13, సత్తెనపల్లి 9, నరసరావుపేట డివిజన్‌వి 17 ఉన్నాయి. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలను నాణ్యతగా, సకాలంలో పరిష్కరించాలన్నారు. ఆయాశాఖల పరిధిలో పీజీఆర్‌ఎస్‌ గ్రీవెన్స్‌పై ఆడిట్‌ నిర్వహించాలని, అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్‌ ఆడిట్‌ పూర్తిచేయాలన్నారు. అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన మేడా రాములమ్మకు 2.5సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేసి కలెక్టరేట్‌లో ఆమె చేతికి పట్టా అందజేశారు. పింఛన్లు కావాలంటూ అర్జీలు అందజేసేందుకు వచ్చిన వారి వద్దకు కలెక్టర్‌ స్వయంగా వెళ్లి అర్జీ స్వీకరించి వారి సమస్య విన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.రవి, డీఆర్‌డీఏ పేడీ ఝాన్సీరాణిలతో వారి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.

మా నాన్నకు మేము ముగ్గురం పిల్లలం. నా బాగోగులు నిమిత్తం గ్రామంలో మూడు ప్రదేశాల్లో ఉన్న 1.26 ఎకరాల వ్యవసాయ భూమి నా పేరున రిజిస్టర్‌ చేశారు. ఇంకా 66 సెంట్ల భూమి, మూడు సెంట్లలో ఉన్న ఇంటిని నా అన్న అనుభవిస్తున్నాడు. మా తండ్రి బాగోగులు చూడట్లేదంటూ నా తండ్రిని కొట్టి నాకు రాసిచ్చిన భూమి రిజిస్ట్రేషన్‌ను ఆర్‌డీఓచే రద్దు చేయించాడు. భూమిని ఆన్‌లైన్‌లో తండ్రి పేరుపై నమోదు చేయించి ఆ భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నాడు. మా నాన్నను చూసేందుకు నాకెంటువంటి అభ్యంతరం లేదు. రద్దుచేసిన రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించి ఆ భూమిపై నాకు హక్కులు కల్పించండి.

– అన్నదాసు నాగలక్ష్మి,

బృగుబండ, సత్తెనపల్లి మండలం

గ్రామంలో మా తాత ఆరు సెంట్ల పోరంబోకు స్థలం ఆక్రమించగా నా తండ్రి దానిలో దాబా కట్టాడు. మేము ముగ్గురం అన్నదమ్ములం. నా సోదరుడు ఆ ఇంటిని స్వాధీనం చేసుకొని తన పేరుపై రిజిస్టర్‌ చేయించుకున్నాడు. ఆ రిజిస్ట్రేషన్‌ రద్దుచేసి నాకు భాగం కల్పించండి.

– సయ్యద్‌ అబ్దుల్‌ సలామ్‌,

దొడ్లేరు, క్రోసూరు మండలం

ముఠా కూలీగా పనిచేసే నేను ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నా. నాకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పింఛన్‌ మంజూరు చేయండి.

– వడియాల శివయ్య,

సాతులూరు, నాదెండ్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement