రూ.కోటి అంచనా వ్యయంతో కొండవీడు ఉత్సవాలు
ఉత్సవాలపై సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్
నరసరావుపేట: కోటి రూపాయల అంచనాతో కొండవీడు ఉత్సవాలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించే ఉత్సవాలపై అధికారులతో సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ.75 లక్షలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు. ఫిబ్రవరి ఐదో తేదీన చిలకలూరిపేట పట్టణంలో 2కె రన్ ద్వారా ఉత్సవాలకు సంబంధించిన తొలి అంకానికి అడుగు వేయనున్నామన్నారు. దాదాపు 10 వేల మంది విద్యార్థులకు 7, 8 తేదీల్లో కొండపై వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు. హెలీరైడ్, ఫుడ్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్నారు. హెలీరైడ్‌కి ఒక వ్యక్తికి రూ.3,500 ధర నిర్ణయించారు. ఉత్సవాల కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, ఆర్డీఓ కె.మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


