తిరుమల ప్రసాదానికి బాబు చేసింది ఘోర అపచారం
బాబు కుట్రల వల్ల రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి స్వామి బాబు, పవన్ చేసిన తప్పులకు పాప పరిహార పూజలు చేస్తున్నాం ఫ్లెక్సీలతో మరో పాపానికి ఒడిగడుతున్నారు దేవుడంటే చంద్రబాబుకు కనీసం భక్తి లేకుండాపోయింది గోరంట్ల వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
గుంటూరు రూరల్: తిరుమల ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఒక అబద్ధం చెబితే దానిని నిజం చేసేందుకు పవన్‌కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి సనాతన ధర్మం పేరుతో మరిన్ని అబద్దాలను పలికాడని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మండలంలోని గోరంట్ల గ్రామంలో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు చేసిన అబద్దపు ప్రచారానికి పాప పరిహారంగా బాబుకు బుద్ధి రావాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంబటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక భారీ కుట్ర పూర్తిగా బద్దలైందన్నారు. సీబీఐ విచారణలో తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని తేలిందన్నారు. లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పి అబద్దపు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు నేడు సీబీఐ విచారణ తరువాత నోరు మెదపటంలేదన్నారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఆ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి భక్తులు హిందువుల మనోభావాలను దెబ్బతీశామని గుర్తించి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తూ, మరలా అబద్దపు ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇప్పటికై నా వేంకటేశ్వరస్వామి పవన్‌కల్యాణ్‌కు, చంద్రబాబుకు బుద్ది ప్రసాదించాలని కోరారు. దేశంలోనే ప్రముఖమైన ఎన్‌డీడీబి, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌లు పరీక్షలు చేసి చంద్రబాబు ఆరోపించిన ఎటువంటి కొవ్వు గానీ, గొడ్డు కొవ్వుకానీ, పంది కొవ్వుకానీ తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యిలో లేదని నివేదికను ఇచ్చాయన్నారు. దీంతో తాము చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు మరో డ్రామా అబద్దాల డ్రామా మొదలుపెట్టాడన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


