ఔషధ నియంత్రణ పాటించని ఆర్‌ఎంపీకి శిక్ష
పిడుగురాళ్ల: ఔషధ చట్టాన్ని ఉల్లంఘించిన ఆర్‌ఎంపీకి పిడుగురాళ్ల జూనియర్ సివిల్ కోర్డు జడ్జి ప్రవల్లిక గురువారం శిక్ష విధించినట్లు పిడుగురాళ్ల డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పి.మంగమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన కొర్రపోలు పెదవెంకయ్య గతంలో విధులు నిర్వర్తిస్తున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఏఎన్ క్రాంతికుమార్ దాడులు నిర్వహించిన సమయంలో ఈ పెద వెంకయ్య ఆర్‌ఎంపీగా విధులు నిర్వహిస్తూ డ్రగ్ నిషేధ చట్టాన్ని ఉల్లంఘించి అతని వద్ద మందులు ఉంచటంతోపాటు ఆపరేషన్లు కూడా నిర్వహించాడని అప్పటి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కేసు ఫైల్ చేశారు. ఆ కేసు పిడుగురాళ్ల కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.విజయ్‌కుమార్ వాదోపవాదల అనంతరం పెద వెంకయ్య కుటుంబీకులు విజ్ఞప్తి మేరకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల అపరాధ రుసుం న్యాయమూర్తి టి.ప్రవల్లిక విధించారు. ఈ రెండీటిల్లో ఏదైనా ఒకటి ఉల్లంఘించినా అదనంగా ఒక నెల జైలు శిక్ష, మరో రూ.20 వేలు జరిమానా చెల్లించాల్సి వస్తుందని న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు ప్రస్తుత పిడుగురాళ్ల సెక్టార్ ఇన్‌స్పెక్టర్ పి.మంగమ్మ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
జె.పంగులూరు: మోటార్ సైకిల్‌పై వేగంగా వస్తూ ట్రాక్టర్ ట్రక్కు వెనుక భాగాన్ని ఢీ కొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సమీపంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రేణింగవరం ఎస్సై వినోద్‌బాబు తెలిపిన వివరాలు...చందలూరు గ్రామానికి చెందిన పెంట్యాల సుధాకర్ (55) అద్దంకి నుంచి స్వగ్రామం చందలూరు తన మోటార్ సైకిల్‌పై వస్తున్నాడు. చందలూరు సమీపంలోకి వచ్చే సరికి మలుపు తిరిగే సమయంలో ఎదురుగా ట్రాక్టర్ ట్రక్కును గమనించక ఢీ కొట్టాడు. అతని తలకు బలమైన గాయం కావడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన సుధాకర్‌కు భార్య అనంతలక్ష్మి, కుమారులు విష్ణు, చరణ్ ఉన్నారు.
బీసీ విభాగం జిల్లా కమిటీ నియామకం
బాపట్ల: జిల్లా వైఎస్సార్ సీపీ బీసీ విభాగం కమిటీని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎం.వెంకట్రావు(వేమూరు),మన్నెం రాజశేఖర్(అద్దంకి), జనరల్ సెక్రటరీలుగా యద్దనపూడి హరిప్రసాద్ (పర్చూరు),పేరాల సురేష్(బాపట్ల),కె.శ్రీనివాసరావు(రేపల్లె),ఓ. వీరయ్య(అద్దంకి),పి.వెంకట దుర్గా కిరణ్(వేమూరు),సెక్రటరీలుగా జి.సుధాకర్(చీరాల), షేక్ కరిముల్లా(అద్దంకి), వెలనాటి వెంకట్రావు(పర్చూరు), ఆరేపల్లి శివయ్య(బాపట్ల), మరకా సురేష్(రేపల్లె),ఎం.నాగేశ్వరరావు(వేమూరు), బి.సురేష్(చీరాల)లను నియమించారు. వీరితోపాటు పలువురిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు.
వ్యాసరచనలో కొప్పరపాడు విద్యార్థిని ప్రతిభ
బల్లికురవ: బాపట్ల జిల్లా స్థాయిలో జరిగిన వ్యాసరచన పోటీల్లో కొప్పరపాడు ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రథమస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం పి. శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. డిజిటల్ న్యాయవ్యవస్థ ద్వారా సమర్థవంతమైన, వేగవంతమైన పరిష్కారం అనే అంశంపై తెలుగు మీడియం విభాగంలో పి. లక్ష్మీ అమూల్య ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని రూ. 5 వేల పారితోషిక అవార్డు పొందినట్లు చెప్పారు. మంగళవారం విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు బాపట్ల జిల్లా తరఫున పాల్గొననున్నట్లు హెచ్‌ఎం వివరించారు. ఎంపీడీవో కుసుమకుమారి ఎంఈఓలు కె. శ్రీనివాసరావు, కె.రమేష్‌బాబు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
కేంద్రం చేతిలో ఉపాధి చట్టం నిర్వీర్యం
తెల్ల గాంధీ విగ్రహం వద్ద నిరసన
చీరాల: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్ట స్ఫూర్తిని దెబ్బతీస్తూ.. పేరు మార్పు చేయడం అంటే.. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడమేనని సీపీఎం చీరాల ప్రాంతీయ కమిటీ కార్యదర్శి ఎన్.బాబూరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పేరు మార్పును వ్యతిరేకిస్తూ సీపీఎం చీరాల ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కొట్లబజారులోని తెల్లగాంధీ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధిని హక్కుగా కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఉపాధిని హక్కుగా కాకుండా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పథకంగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. సీపీఎం కమిటీ సభ్యులు ఎం.వసంతరావు, ప్రసాద్, జి.ఇమ్మాన్యుల్, పి.శ్రీనివాసరావు, డి.మోషే, యు.సాంబయ్య, గోపి, రాంబాబు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
బంగారు ఆభరణాలు చోరీ
చీరాల: ఇంటికి వేసిన తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. ఈ సంఘటన శుక్రవారం కేపాల్ కాలనీలో చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుట్టా ఫణిరాజ అనే మహిళ చీరాల మండలం కేపాల్ కాలనీలో నివాసముంటోంది. ఆమె భర్త రాజస్థాన్‌లో సీఆర్‌పీఎఫ్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు సమీపంలోని ఆమె హాస్పిటల్‌కు వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం 12గంటలకు ఇంటికి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.2.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె చీరాల ఒన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మహిళా ఎస్సై రాజ్యలక్ష్మి తెలిపారు.
ఔషధ నియంత్రణ పాటించని ఆర్‌ఎంపీకి శిక్ష


