సౌర శక్తి వియోగిద్దాం..విద్యుత్ పొదుపు చేద్దాం
మాచర్ల: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు పలు మండలాలలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పల్నాడు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) డాక్టర్ విజయ్‌కుమార్ చెప్పారు. మాచర్ల రీజియన్ పరిధిలోని ఏఈలు, ఏఓలు, ఉద్యోగులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొదుపునకు సంబంధించి పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సబ్సిడీ ఇవ్వటం, కనెక్షన్ పొందినప్పటికీ ఎటువంటి బిల్లులు లేకుండా చేయటం జరుగుతుందన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని విద్యుత్‌ను పొదుపు చేయాలని అన్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులు పలు ప్రయోజనాలు పొందవచ్చునన్నారు. పట్టణంలోని రూ.4.5 కోట్లతో ఈ నెల 24న ప్రజా ప్రతినిధులచే టిడ్కో వద్ద నూతనంగా నిర్మించే సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులంతా వెంటనే బకాయిలు చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించి మెరుగైన విద్యుత్ పొందాలన్నారు. కార్యక్రమంలో డివిజినల్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ఎన్ సింగయ్య, పల్నాడు జిల్లా సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ బి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ శాఖాధికారులతో వివిధ సమస్యలపై చర్చించారు.
విద్యుత్ శాఖ ఎస్‌ఈ డాక్టర్ పి విజయ్‌కుమార్


