నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష
ఎస్సీఈఆర్టీ మోడల్ పేపర్లే దిక్కు
మార్చి 16వ తేదీ నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనుండటం, జెడ్పీ నుంచి స్టడీ మెటీరియల్ అందకపోవడంతో ఎస్సీఈఆర్టీ సిద్ధం చేసిన మోడల్ పేపర్లే దిక్కయ్యాయి. ఎస్సీఈఆర్టీ మోడల్ పేపర్లను పలువురు హెచ్‌ఎంలు పుస్తక రూపంలో ముద్రించారు. వీటితోపాటు అవే పేపర్లను జిరాక్స్‌లు తీయించి పాఠశాలల్లో విద్యార్థులతో చదివిస్తున్నారు. జెడ్పీ నుంచి స్టడీ మెటీరియల్‌ను ఆలస్యంగా పంపిణీ చేయడం వలన విద్యార్థులకు ప్రయోజనం ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
● ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్
విద్యార్థులకు ఏటా ఉచిత మెటీరియల్
● ఈ ఏడాది ప్రశ్నార్థకంగా పంపిణీ
● గత వైఎస్సార్ సీపీ పాలనలో
నిరాటంకంగా అందజేత
● ఉమ్మడి గుంటూరు జిల్లాలో
35 వేల మంది విద్యార్థులు
● ‘అల్పాహారం’ కూడా లేక అవస్థలు
గత ప్రభుత్వంలో నిరాటంకంగా..
అర్ధాకలితో హాజరవుతున్న విద్యార్థులు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి సిద్ధమవుతున్న విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకధాటిగా నిర్వహిస్తున్న రెగ్యులర్, అదనపు తరగతులకు వారు హాజరవుతున్నారు. మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. సాయంత్రం అదనపు తరగతులు ముగిసే వరకు ఖాళీ కడుపులతో నెట్టుకువస్తున్నారు. పట్టణ, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి బయల్దేరి వస్తున్నారు. నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంతో ఎస్సీఈఆర్టీ ద్వారా నూరు రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం పాఠశాలల్లో అదనపు తరగతులను నిర్బంధంగా అమలు చేస్తోంది. వారి ఆకలిని మాత్రం మరిచిపోయింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 186 ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, సోషల్, బీసీ వెల్ఫేర్ పాఠశాలల నుంచి పరీక్షలకు సన్నద్ధమవుతున్న 10,384 మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. గతేడాది కూడా జిల్లా పరిషత్ ద్వారా నెల రోజులు మాత్రమే అమలు చేశారు. విద్యార్థికి రూ.10 చొప్పునే కేటాయించారు. ఈ సారి కనీసం ఎటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు. మరోవైపు అధికారుల హెచ్చరికలు, ఆకస్మిక తనిఖీలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు.
చంద్రబాబు పాలనలో పదో తరగతి విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఉత్తీర్ణత శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు... బాలలకు ఆ మేరకు వసతులు కల్పించడంలో చేతులెత్తేసింది. కనీసం ప్రణాళిక కూడా లేకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తూ విద్యార్థులను అర్ధాకలితో అలమటింపజేస్తోంది. స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు. అదనపు తరగతులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బడిలోనే ఉంటున్న విద్యార్థులకు అల్పాహారం పెట్టడానికీ చంద్రబాబు సర్కారుకు మనసు కూడా రావడం లేదు.
నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష


