
సాగులో సాంకేతికతపై పట్టు సాధించాలి
రేపల్లె: వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించటంపై పట్టుసాధించి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ సహాయ సంచాలకులు అద్దేపల్లి లక్ష్మి అన్నారు. సాగులో సాంకేతికత వినియోగంపై వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో మండలంలోని పేటేరు వ్యవసాయ సహాయ కేంద్రంలో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న మార్పులకు అనుగుణంగా యంత్ర పరికరాలు వస్తున్నాయని, వీటితో సమయం, డబ్బులు ఆదా అవుతాయని చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్.ఏడుకొండలు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే మినీ రైస్ మిల్, అపరాల పంటల విధానాలు, వివిధ రకాల నూనె గింజల నుంచి నూనె తయారు చేసే విధానాలను వివరించారు. డాక్టర్ వాసుదేవ మాట్లాడుతూ సోలార్ డ్రైయర్ పనితీరు, దీని ఉపయోగంతో పాటు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ద్వారా రైతులు పంటకు విలువ జోడించి అధిక ఆదాయం పొందే మార్గాలను సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ సందీప్, ఏఓ మహేష్‌బాబు, వీఏఏ రాయల్‌బాబు, రైతులు, బాపట్ల పోస్ట్ హార్వెస్టర్ రీసెర్చ్ సెంటర్ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.