
మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం
వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి మాజీ మంత్రి విడదల రజిని మురికిపూడిలో రచ్చబండ నిర్వహణ
చిలకలూరిపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో రచ్చబండ ద్వారా సంతకాల సేకరణ కార్యక్రమానికి సోమవారం రాత్రి శ్రీకారం చుట్టారు. ముందుగా ఆమె సంతకం చేసి ప్రజలతో కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాలు చేయించారు. రజిని మాట్లాడుతూ రచ్చబండ ద్వారా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడదామని తెలిపారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ గ్రామ స్థాయి వరకు ప్రజాఉద్యమం ప్రారంభించిందని వెల్లడించారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 ప్రభుత్వ వైద్యకళాశాలల నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఇందుకు విరుద్దంగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల నాణ్యమైన వైద్యం, వైద్య విద్య దూరం చేసేలా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టి తనకు ఏ మాత్రం పేదల పట్ల ప్రేమ లేదని చాటు కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాసంఘాలతో కలసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఉద్యమంలో భాగంగా అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ చిలకలూరిపేట మండల అధ్యక్షుడు దేవినేని శంకరరావు, ఉపాధ్యక్షుడు కొమ్మనబోయిన హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు షేక్ దరియావలి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, మానుకొండ శేషిరెడ్డి, బొల్లు శ్రీకాంత్, గ్రామ ఉపసర్పంచ్ కొమ్మనబోయిన రామకృష్ణరాజు, శ్రీను, పార్టీ గ్రామ అధ్యక్షుడు బొట్టు సోమయ్య, ఎద్దు అశోక్, చెంచు రాముడు, గోగు ముక్కంటి, అందె శ్రీనివాసరావు, ఆరుమళ్ల నాగేశ్వరరావు, మురికిపూడి కృష్ణ, షేక్ నూర్ అహమ్మద్, యలమంద, మైలా రాజేష్, బండారు జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం