
జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో రజత పతకం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒడిశాలో ఈ నెల 10 నుంచి 14 వ తేదీ వరకు జరిగిన 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గుంటూరుకు చెందిన ఎస్కే రోషన్ రజత పతకం సాధించాడు. అండర్ 20 యూత్ విభాగంలో 110 మీటర్ల హర్డల్స్‌లో ఈ పతకాన్ని సాధించాడని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జి.వి.ఎస్. ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రోషన్‌ను ఏపీ రెరా సభ్యుడు దామచర్ల శ్రీనివాసరావు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో అభినందించారన్నారు. స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్ కూడా బాగు చేయాలని కోరారు. సదుపాయాలు కల్పిస్తే మరింత మంది రాణిస్తారని ఆకాంక్షించారు. రోషన్‌ను కోచ్ రామకృష్ణ, కె.రవి, కె.అరుణ్ కుమార్, పి.ఆనంద్ కుమార్, ఎస్కే మన్సూర్ వలి తదితరులు అభినందించారు.