
ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులనే వాడాలి
నరసరావుపేట: ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తు ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించి తద్వారా దేశ ఆర్థిక స్వావలంనలో పాలుపంచుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆత్మ నిర్భర్ భారత్ కోస్తా ఆంధ్ర కన్వీనర్ కోడూరి అశోక్‌రాజు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ అధ్యక్షతన మంగళవారం నరసరావుపేట సత్తెనపల్లి బస్టాండ్ సెంటర్‌లోని విజయ్‌కుమార్ కల్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మ నిర్భర్ భారత్ జిల్లా కార్యశాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ అనంతరం ఆత్మనిర్భర్ భారత్ కోసం రూ.20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ కేటాయించి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా స్థానిక వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించారని అన్నారు. ప్రస్తుతం నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి అతిత్వరలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ దేశాన్ని జగద్గురువుగా అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నంలో ప్రజలను భాగస్వాములను చేసే విధంగా ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు. అధ్యక్షత వహించిన శశికుమార్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో స్వదేశీ ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యం నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్‌కు ఉందని చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆత్మనిర్భర్ కార్యక్రమ జిల్లా కన్వీనర్ శెట్టి హనుమంతరావు సమావేశంలో పాల్గొన్న సభ్యులచే స్వదేశీ వస్తు ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించే ప్రతిజ్ఞ చేయించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్రరెడ్డి. జిల్లా ఇన్‌ఛార్జి కొక్కెర శ్రీనివాస్, జిల్లా పదాధికారులు, మండల నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, మండల త్రిసభ్య కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ కన్వీనర్
అశోక్‌రాజు