
జీవన ఎరువులే పంటకు జీవం
పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నగేష్ శాస్త్రవేత్తల రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహణ
యడ్లపాడు: ప్రతి పంటకు జీవం జీవన ఎరువులేనని పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నగేష్ అన్నారు. జీవన ఎరువుల ప్రాముఖ్యతపై జరుగుతున్న వారోత్సవాలలో భాగంగా మంగళవారం యడ్లపాడు మండల పరిషత్ కార్యాలయంలో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సత్యగోపాల్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. నగేష్ మాట్లాడుతూ జీవన ఎరువుల వినియోగం వల్ల దాదాపుగా 25 శాతం రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ఇవి భూసారాన్ని పెంపొందించి, పంటలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని అన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని, నాణ్యతతో కూడిన దిగుబడిని సాధించవచ్చని తెలిపారు. శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సత్యగోపాల్ మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా తయారయ్యే జీవన ఎరువులు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని వివరించారు. గాలిలోని నత్రజనిని స్థిరీకరించి పంటకు అందుబాటులోకి తేవడం, భూమిలో అందుబాటులో లేని భాస్వరం, పొటాష్ పోషకాలను మొక్కకు అందుబాటులోకి తేవడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో జీవన ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి హేమలతాదేవి, అభ్యుదయ రైతు పోపూరి శివరామకృష్ణ, జగ్గాపురం, యడ్లపాడు గ్రామాల్లోని విద్యార్థినులు పి గాయత్రి, ఎ బేబీవిజయశ్రీ, సీహెచ్ కీర్తిశ్రీనిధి, జ్యోత్న్స, ఎ జోషితశ్రేయ, చాందిని, భాగ్యశ్రీ, ఎం జ్యోత్న్స, డి భువనేశ్వరీ, ఎన్ హర్షిత, కె హర్షిత, ఎండీ హమిద పాల్గొన్నారు.