
కాటేసిన కడలి
చీరాల: వారంతా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. బీటెక్ చదివేందుకు ఒకే కాలేజీలో చేరారు. మంచి స్నేహితులయ్యారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా సముద్ర తీరంలో స్నానం చేస్తూ ఆనందంతో కేరింతలు కొడుతూ లోతును అంచనా వేయలేకపోయారు. నిమిషాల వ్యవధిలోనే గల్లంతయ్యారు. స్థానికులు గమనించి నలుగురిని ఒడ్డుకు చేర్చిగా, మిగిలిన ముగ్గురు కడలిలో కలిసిపోయారు. మరో సంఘటనలో సరదాగా సాగరతీరానికి వచ్చిన వారిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. రెండు ఘటనల్లో ఐదుగురు విద్యార్థులు కడలి కెరటాలకు బలి కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.
ఎగసిపడిన అలలు
అమరావతిలోని విట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్న ఏడుగురు స్నేహితులు ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు చీరాల రూరల్ మండలం వాడరేవు సముద్రతీరానికి వచ్చారు. అలల ధాటిని కూడా లెక్కచేయకుండా సముద్రంలో కేరింతలు కొట్టారు. కొద్దిసేపటికి అలలు ఎక్కువగా రావడంతో ఏడుగురు గల్లంతయ్యారు. స్థానిక మైరెన్ పోలీసులు, గజ ఈతగాళ్లు గమనించి నలుగురు విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. అయితే, వీరిలో సాయి మణిదీప్ (జడ్చర్ల), జీవన్ సాత్విక్ (హైదరాబాద్), శ్రీసాకేత్ (హైదరాబాద్)లు సముద్రంలో గల్లంతయ్యారు.కొంత సమయం తర్వాత ముగ్గురి మృతదేహాలు తీరానికి చేరాయి. అప్పటి వరకు కలిసి ఉన్న స్నేహితులు విగత జీవులుగా మారడంతో స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుల వివరాలను సేకరించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
వివాహ వేడుకకు వచ్చి..
వేటపాలెం మండలం వడ్డె సంఘానికి చెందిన మరో ఇద్దరు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. శనివారం వివాహ వేడుక జరిగింది. ఆదివారం సరదాగా గడిపేందుకు వాడరేవు తీరానికి కుటుంబంతో వచ్చారు. సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లగా వడ్డె సంఘానికి చెందిన గౌతమ్ (15), షారోన్ (18) గల్లంతయ్యారు. షారోన్ సోదరి వివాహానికి అదే ప్రాంతానికి చెందిన గౌతమ్ మరికొందరు ఆదివారం సముద్రతీరానికి వచ్చారు. అయితే, వీరి మృతదేహాలు ఇంకా తీరానికి రాలేదు. షారోన్ రాజమండ్రిలో బీటెక్ చదువుతుండగా, గౌతమ్ కొత్తపేట జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. గల్లంతైన వారి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
వాడరేవు సముద్రతీరంలో ఐదుగురు యువకులు మృత్యువాత పడడంతో సమాచారం తెలుసుకున్న ఎస్పీ ఉమామహేశ్వర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు. జరిగిన సంఘటనలపై ఆరా తీశారు. అలలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మైరెన్ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆదివారం జరిగిన సంఘటనలో కూడా మైరెన్ పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లు కొంతమందిని కాపాడారని చెప్పారు. పర్యాటక ప్రాంతంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విషాదం నింపిన విహారం
కన్నీటి సంద్రంగా మారిన తీరం
వేర్వేరు ఘటనల్లో ఐదుగురు గల్లంతు
ముగ్గురి మృతదేహాలు లభ్యం
జాడలేని మరో ఇద్దరి మృతదేహాలు
మృతుల్లో నలుగురు ఇంజినీరింగ్
విద్యార్థులు, ఒకరు పదో తరగతి విద్యార్థి

కాటేసిన కడలి