
మెలియాయిడోసిస్ కలకలం
సాక్షి, నరసరావుపేట : వెల్దుర్తి మండలం వజ్రాలపాడు పంచాయతీ దావుపల్లితండాలో మెలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో పల్నాడు జిల్లాలో కలకలం మొదలైంది. తండాకు చెందిన హర్యా నాయక్ దోమవత్‌కి తీవ్ర జ్వరం రావడంతో యర్రగుండపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు. ఎంతకూ జ్వర లక్షణాలు తగ్గకపోవడంతో అక్కడి డాక్టర్ సూచనతో మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి వెళ్లాడు. నెలరోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండటం, జ్వర తీవ్రత తగ్గకపోవడంతో అనుమానం వచ్చి రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపారు. మెలియాయిడోసిస్ లక్షణాలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి రవి, ఇతర వైద్య బృందం దావుపల్లితండాలో పర్యటించారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి గ్రామంలో ఇంకా ఎవరైనా వ్యాఽధి లక్షణాలతో బాధపడుతున్నారేమో ఆరా తీశారు. మట్టి, ధూళితో వ్యాధి ప్రభలే అవకాశాలు ఉండటంతో తండాలో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టారు. మెలియాయిడోసిస్ అంటువ్యాధి కాదంటూ గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హర్యానాయక్ శనివారం రాత్రి గ్రామానికి చేరుకున్నాడు. ఆరోగ్యం నయమవ్వడానికి మూఢనమ్మకంతో తాయత్తు కట్టించుకున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న వైద్యాఽధికారులు తండాకు చేరుకొని రోగికి అవసరమైన కౌన్సెలింగ్ ఇచ్చి గుంటూరు జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెలియాయిడోసిస్ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి దీని ప్రభావం అధికంగా ఉంటుంది. మారుమూల ప్రాంతాలైన తండాలలో నివసిస్తున్న గిరిజనులకు వైద్య సేవలు అందించడంతోపాటు, వారికి వ్యాధి పట్ల అవగాహన కల్పించి మంచి పౌష్టికాహారం అందిచాల్సి ఉంది.
మెలియాయిడోసిస్ ఇదో అరుదైన వ్యాధి. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో మొత్తం 28 మంది ప్రాణాలను వ్యాధి బలిగొంది. ఈ వ్యాధి ఇప్పుడు పల్నాడులో ప్రవేశించింది. పొరుగు జిల్లాలో జరిగిన ప్రాణ నష్టం గురించి విన్న పల్నాడు ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం, వైద్యాధికారులు అప్రమత్తమై నివారణకు ముందస్తు చర్యలు తీసుకోకుంటే పెనుప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు.
వెల్దుర్తి మండలం
దావుపల్లితండావాసికి లక్షణాలు
మంగళగిరిలోని ఓ ప్రైవేట్
ఆసుపత్రిలో చేరిక
చికిత్స పొందకుండా ఆసుపత్రి
నుంచి గ్రామానికి చేరుకున్న రోగి
కౌన్సెలింగ్ ఇచ్చి గుంటూరు
జీజీహెచ్‌కి తరలించిన వైద్యాధికారులు
గ్రామంలో మరెవరిలో లక్షణాలు
లేవంటున్న జిల్లా వైద్యాధికారి
గుంటూరు జిల్లా తురకపాలెంలో
వరుస మరణాల నేపథ్యంలో
భయాందోళనలో స్థానికులు
ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి
అనుమానితులకు పరీక్షలు
నిర్వహించకపోతే పెను ప్రమాదం

మెలియాయిడోసిస్ కలకలం