
ఓపెన్ స్కూల్ ప్రవేశాలు గడువు పెంపు
డీఈఓ చంద్రకళ
నరసరావుపేట ఈస్ట్: సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియేట్ (దూరవిద్య) కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కె.ఎం.ఏ.హుస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్ ఆర్.నరసింహారావు ఉత్తర్వులు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. అపరాధ రుసుం రూ.200 చెల్లించి ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటి వద్ద ఉంటూనే దూరవిద్య విధానంలో 10వ తరగతి, ఇంటర్మీడియేట్ పూర్తిచేసే అవకాశం ఉందని వివరించారు. ప్రవేశాలు పొందిన అభ్యాసకులు సెలవు రోజుల్లో నిర్వహించే క్లాసులు, ప్రాక్టికల్స్‌కు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. అభ్యాసకుల అడ్రస్‌కు నేరుగా పుస్తకాలు పంపుతారని పేర్కొన్నారు. రెగ్యులర్ కోర్సు ద్వారా పొందే సర్టిఫికెట్లకు ఎంత విలువ ఉంటుందో ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లకు అంతే విలువ ఉంటుందన్నారు. సదరు సర్టిఫికెట్లతో ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు సమీపంలోని ఏఐ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు.
అస్వస్థతకు గురై వృద్ధురాలు మృతి
నాదెండ్ల: టూత్ పేస్ట్‌గా భావించి ఎలుకల నివారణ పేస్ట్‌ను వినియోగించి వృద్ధురాలు మృత్యువాత పడిన సంఽఘటన సాతులూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ జి పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. జెట్టిపాటి పోలేరమ్మ (69) ఈనెల 8న ఉదయం పళ్లు తోముకునేందుకు టూత్ పేస్ట్ అనుకుని ఎలుకల నివారణ పేస్ట్‌ను వినియోగించింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురికావటంతో కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త, కుమార్తె గతంలో మృతి చెందగా, ప్రస్తుతం ఈమె మనవళ్ల సంరక్షణలో ఉంటుంది. వృద్ధురాలి మనుమడు మల్లికార్జునరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నరసరావుపేట: స్థానిక పాలపాడు రోడ్డులోని ఎస్‌ఎన్‌ఆర్ కన్వెన్షన్ హాలులో ఆదివారం వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఏపీ జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా ఉన్నం వేణుగోపాల్, కార్యదర్శిగా అబ్దుల్ కరీం, కోశాధికారిగా ఎన్.అక్షయ్‌కుమార్, గౌరవ అధ్యక్షులు జీపీ రంగయ్య, గౌరవ సలహాదారుగా జీవీ రఘురాం, ఉప అధ్యక్షులుగా బి.కోటేశ్వరరావు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యఅతిఽథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రాంబాబు, చైర్మన్ కుమార్ మంగళం, ప్రధాన కార్యదర్శి మైనేని లక్ష్మణ్ హాజరై ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాజీ అధ్యక్షులు దాసరి నాగ్‌శ్రీనివాస్, సీహెచ్.శ్రీనివాసకుమార్, సంయుక్త కార్యదర్శి బొందిలి శ్రీనివాససింగ్ హాజరయ్యారు.