కానుక భూములు అన్యాక్రాంతం | - | Sakshi
Sakshi News home page

కానుక భూములు అన్యాక్రాంతం

Oct 13 2025 7:32 AM | Updated on Oct 13 2025 7:32 AM

కానుక భూములు అన్యాక్రాంతం

కానుక భూములు అన్యాక్రాంతం

కానుక భూములు అన్యాక్రాంతం

న్యాయం చేసేదాక పోరాటం

యడ్లపాడు: రాజుల పాలనా కాలంలో తమ పూర్వీకులు సర్వీసు ఈనాం (కానుక)గా పొందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని వాటిని తిరిగి వారి వారసులకు అప్పగించాలని కోరుతూ యడ్లపాడు మండలంలోని బోయ సంక్షేమ సంఘం 19 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. చివరకు సమస్య హైకోర్టుకు చేరింది. చిలకలూరిపేట జమీందారు రాజా మానూరు వెంకట హనుమంతరాయణం పాలన కాలంలో భటులుగా ఉన్న వీరి కుటుంబాల జీవనోభృతికి సర్వీస్‌ ఈనాం కింద వంకాయలపాడు, కొండవీడు, మైదవోలు, సొలస, యడ్లపాడు, తిమ్మాపురం, జాలాది, కారుచోల వంటి 8 గ్రామాల్లో దాదాపు 2,500 ఎకరాల భూముల్ని ఇచ్చారని, మొదట ఉన్నవ గ్రామంలో నివాసం ఉన్న ఈ బోయలు తర్వాత ప్రస్తుతం 16వ నంబర్‌ జాతీయ రహదారి పక్కన నివాసాలు ఏర్పరచుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా బోయలు ఉన్నందున బోయపాలెంగా రూపాంతరం చెందిందని వీరు చెబుతుంటారు.

అక్రమాల పర్వం ఎలా మొదలైంది?

1956లో ప్రభుత్వం ‘ఇనాం ఎబాలేషన్‌ యాక్ట్‌’ను ప్రవేశపెట్టింది. దీంతో భూముల రికార్డులు సరిదిద్దే రీసెటిల్‌మెంట్‌ ప్రక్రియ అప్పటి అధికారులకు వరంగా మారింది. దీంతో హక్కుదారులైన బోయలకు అప్పగించకుండా రికార్డుల్లో బీనామీ పేర్లను చేర్చినట్లు బోయ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా నమోదైన వాటికి ఇంటిపేరు, తండ్రిపేరు, చిరునామా లేకపోవడమే భూ అక్రమాలకు నిదర్శనమని చెబుతున్నారు. ఈనాం భూములకు ప్రధాన ఆధారాలైన ఈనాం బీ రిజిస్టర్‌, రైత్వారీ పట్టా(ఫారం–8)లో అడంగళ్‌ 1బీలోని వివరాలు కనిపించకపోవడం గమనార్హమని అంటున్నారు.

19 ఏళ్ల పోరాటం..

తమ భూములు అన్యాక్రాంతమయ్యాయని గుర్తించిన బోయల వంశీయులు సమస్యను 2006లో యడ్లపాడు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లా రు. నాటి నుంచి రెవెన్యూ శాఖకు 34 దరఖాస్తులు సమర్పించినా ఎటువంటి స్పందన లేక 2022లో హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.

సంఘం ఆరోపణల్లోని ప్రధాన అంశాలు...

ఒకే సర్వే నంబర్‌లో ఈనాం బీ రిజిస్టర్‌లో ఒక పేరు, ఫారం–8లో మరో పేరు, క్షేత్రస్థాయిలో మరో పేరు ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ అక్రమాలకు పాల్పడిన వారిలో అగ్రవర్ణాల వారే ఎక్కువగా ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు 2 శాతం కూడా లేరని బోయ సంక్షేమ సంఘం ఆరోపిస్తోంది. అక్రమంగా భూములు అనుభవిస్తున్న వారి వద్ద చట్టబద్ధమైన రైత్వారీ పట్టాలు లేవు. ఇవన్నీ లేకుండానే వంశపారంపర్యంగా సంక్రమించినట్లు అధికారుల ద్వారా రీసర్వే సమయంలో ఎల్‌పీ నంబర్లు, పాస్‌పుస్తకాలు పొందారని సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.

అధికారుల వాదన ఇలా..

ఈనాంగా భటులు భూములు పొందినట్లు, సదరు భూములు వారి స్వాధీనంలో ఉన్నట్లు రికార్డులు ఏవీ అందుబాటులో లేవన్నది అధికారులు వినిపిస్తున్న వాదన. ఇనాం ఎబాలిషన్‌ యాక్ట్‌ నుంచి రైతుల పేర్లు మాత్రమే రికార్డుల్లో నమోదై ఉన్నాయని, నాటి నుంచి నేటి వరకు అవి ఎన్నో లావాదేవీలు జరిగి ఇతరుల ఆధీనంలో ఉన్నట్లు అధికారులు కోర్టుకు విన్నవించినట్లు సమాచారం.

భట వృత్తిదారులకు భూములిచ్చిన

జమీందారు

భూములను మింగేసిన పెద్దలు

న్యాయం చేయాలంటూ 19 ఏళ్లుగా బోయల పోరాటం

ఈనాం భూములపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టును ఆశ్రయించాం. అన్యాక్రాంతమైన భట వృత్తిదారుల భూములను ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలి. బోయ(భటవృత్తిదారుల)వారసులు, నిజమైన హక్కుదారులకు గుర్తించి వాటిని అప్పగించేందుకు కృషి చేయాలి.

– దగ్గు నరసింహారావు, బోయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement