
అరవ చాకిరీపై ఆగ్రహం
విధులను బహిష్కరించడం ఇదే ప్రథమం
మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న పాలకులు, అధికారుల తీరుతో విసిగి వేసారిన ఉపాధ్యాయులు బోధనేతర విధులను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులా మారింది. ఉపాధ్యాయులు గతంలో ఎన్నడూ ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తులు చేయడం, వినతి పత్రాలు సమర్పించడంతో పాటు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఉపాధ్యాయ సంఘాలు తొలిసారిగా ప్రభుత్వం అప్పగిస్తున్న విధులను బహిష్కరిచడం ఇదే మొదటిసారి. ప్రభుత్వ తీరుపై గురువుల్లో నెలకొన్న అసహనం, వ్యతిరేకతకు ఇది అద్దం పడుతోంది. పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి పాఠశాలల్లో బోధనేతర విధులను బహిష్కరించాలని ఫ్యాప్టో ఇచ్చిన పిలుపులో భాగస్వాములయ్యారు. సోమవారం పాఠశాలలు తెరుచుకున్న తరువాత పోరు ఉద్ధృతం కానుంది.
గురువుల తిరుగుబాటు
● ఫ్యాప్టో ఆధ్వర్యంలో వినతిపత్రాలు
అందజేత
● బోధనేతర కార్యక్రమాల
బహిష్కరణకు పిలుపు
● ఫ్యాప్టోలో 12 ఉపాధ్యాయ
సంఘాలు భాగస్వామ్యం
● జిల్లాలో వేలాది మంది
ఉపాధ్యాయులు బోధనలకు దూరం
● బోధన కాలాన్ని హరించి
వేస్తున్న యాప్‌లపై వ్యతిరేకత
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. తమను బోధనేతర పనుల నుంచి దూరం చేసి, పాఠ్యాంశాల బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర శాఖ పిలుపుతో ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈనెల 7న విజయవాడ ధర్నా చౌక్‌లో ఫ్యాప్టో చేపట్టిన మహా ధర్నాలో వేలాదిగా పాల్గొన్న ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వం అప్పగిస్తున్న అనవసరమైన బోధనేతర పనులతో అసలు తమ వృత్తికి న్యాయం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
యాప్‌లతో అవస్థలు
విద్యాశాఖ అమలు చేస్తున్న బోధనేతర కార్యక్రమాలు ఉపాధ్యాయులను విద్యార్థులకు పాఠాలను చెప్పనీయకుండా చేస్తున్నాయి. విద్యార్థుల హాజరు నమోదు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పనులు, మూల్యాంకన విధులు మినహా అనవసరమైన గూగుల్ షీట్స్ పూర్తి చేయడం, విద్యాశక్తి, జీఎస్టీ 2.0 వంటి సీజనల్ ప్రచార కార్యక్రమాలను చేపట్టబోమని స్పష్టం చేస్తూ ఫ్యాప్టో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్, డీఈవోలకు మెమోరాండంలు సమర్పించారు. మండల స్థాయిలో ఎంఈవోలకు కూడా ఇచ్చారు. బోధనేతర విధులకు దూరంగా ఉండాలని ఫ్యాప్టో నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం నుంచి నిరసన చేపట్టనున్నారు. ఫ్యాప్టోలో భాగస్వాములైన 12 ఉపాధ్యాయ సంఘాలు బోధనేతర విధులు, అర్థం లేని యాప్‌లపై ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.