
యూరియా కోసం పాట్లు
ముప్పాళ్ల: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియాకు కొరత లేదని, రైతులు అధైర్య పడొద్దని ప్రభుత్వం చెబుతున్నా..మరో పక్క రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతూనే ఉన్నారు. ముప్పాళ్లలోని గ్రోమోర్ కేంద్రానికి సోమవారం 440 బ్యాగుల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే సత్తెనపల్లి–నరసరావుపేట ప్రధాన రహదారి పక్కనే ఉన్న గ్రోమోర్ కేంద్రం గోదాం వద్దకు చేరుకున్నారు. దుకాణం ఎప్పుడు తెరిస్తే అప్పుడు కట్టలు అందుతాయనే ఆశతో క్యూలైన్‌లో నిల్చున్నారు. క్రమంగా రైతులు సంఖ్య పెరగటంతో కేంద్రం వద్ద తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. గ్రోమోర్ కేంద్రం నిర్వాహకులు వ్యవసాయశాఖ, పోలీసు అధికారులకు పరిస్థితిని వివరించారు. కేంద్రం వద్దకు చేరుకున్న పోలీసులు రైతుకు రెండు కట్టలు ఇచ్చేలా నిబంధన పెట్టారు. ఆ మేర రైతులకు టోకెన్‌లు అందించారు. ఒక్కో రైతుకు రెండు కట్టలు అందించి చేతులు దులుపుకున్నారు. ఆలస్యంగా వచ్చిన రైతులకు యూరియా అందకపోవటంతో దుకాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాదనకు దిగారు.
క్రోసూరులో తరలివచ్చిన మహిళలు
క్రోసూరు: యూరియా కోసం ఇప్పటి వరకు పురుష రైతులు మాత్రమే క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. తాజాగా సోమవారం మహిళా రైతులు పెద్ద ఎత్తున క్రోసూరులోని సొసైటీ వద్ద బారులు తీరారు. క్రోసూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ పరిధిలోని ఐదు గ్రామాల రైతులకు అందించేందుకు 440 బస్తాల యూరియా సిద్ధం చేశారు. పాస్ పుస్తకానికి రెండు బస్తాల చొప్పున టోకెన్లు సిద్ధం చేశారు. రైతుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఒక బస్తా చొప్పున ఇచ్చేందుకు టోకెన్లు సిద్ధం చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కొందరికి రెండు బస్తాలిచ్చి మిగిలిన వారికి ఒక బస్తా ఎలా ఇస్తారంటూ సొసైటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో టోకెన్‌కు రెండు బస్తాల చొప్పున యూరియా అందచేశారు. టోకెన్లు జారీ చేసినప్పటికీ 50 మంది రైతులకు యూరియా అందించలేకపోయారు. స్టాక్ వచ్చిన వెంటనే ఇచ్చేందుకు టోకెన్ తీసుకున్న రైతుల పేర్లు రికార్డులో నమోదు చేసుకున్నట్లు సొసైటీ కార్యదర్శి నాగేశ్వరరావు వివరించారు.
తెల్లవారుజాము నుంచి
పడిగాపులు

యూరియా కోసం పాట్లు