
తెల్ల బంగారంపైనే మక్కువ
గతేడాది కన్నా 40 వేల ఎకరాలు అదనం
జిల్లాలో గతేడాది కన్నా పెరిగిన పత్తి సాగు
మిర్చికి ప్రత్యామ్నాయంగా పత్తి వైపు మళ్లిన రైతులు
గతేడాది 1.43 లక్షల ఎకరాల్లో
పత్తి సాగు
ఈ ఏడాది ఇప్పటికే 1.83 లక్షల ఎకరాల్లో సాగు
రెండేళ్లుగా పత్తి సాగుకు వెనకాడిన కర్షకులు
పత్తికి రూ.8,110 మద్దతు ధరను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
సాక్షి, నరసరావుపేట: తెల్ల బంగారంగా పిలిచే పత్తి సాగుపై పల్నాడు జిల్లా రైతులు మళ్లీ మక్కువ చూపుతున్నారు. పత్తి సాగుకు పల్నాడు పెట్టింది పేరు. జిల్లా రైతులు మిర్చి, పత్తి పంటలను అత్యధికంగా సాగు చేసేవారు. రెండు, మూడేళ్లుగా పత్తి , మిర్చి పంటలకు చీడపీడలు ఆశించి దిగుబడులు తగ్గాయి. గిట్టుబాటు ధరలు కూడా లేక తీవ్రంగా నష్టపోయారు. దీంతో పత్తి సాగుపై రైతులు వెనక్కి తగ్గారు. ఫలితంగా జిల్లాలో పత్తి సాగు భారీగా తగ్గింది. ప్రత్యామ్నాయంగా రైతులు మొక్కజొన్న, కంది పంటల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఒకానొక దశలో పల్నాడులో పత్తి సాగు చేసే వారు ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది పత్తి సాగు ఆశాజనకంగా పెరిగింది. ఆ పంటపై ఆధారపడి ఉన్న కూలీలు, పరిశ్రమలు, వ్యాపారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
పత్తి పంట సాగుకు మిగిలిన పంటలతో పోల్చితే పెట్టుబడి ఎక్కువ. అయితే దిగుబడి, ధర మంచిగా ఉంటే అధిక లాభాలు వస్తాయన్న ఆశతో రైతులు అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తారు. గతంతో పోల్చితే రైతులు అవసరం లేకపోయినా ఎరువులు, పిచికారి మందుల వాడకం అధికమైంది. దీంతో ఖర్చులు అధికమవుతున్నాయి. మరోవైపు రెండు, మూడేళ్లుగా పత్తి పంటకు గులాబీ రంగు పురుగు, ఇతర తెగుళ్లు సోకడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక 2023, 2024 ఖరీఫ్‌లో సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో కొంతమంది రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. ఎక్కువ మంది మిర్చి పంట సాగు చేయగా, మరికొందరు పొగాకు సాగు చేశారు. గతేడాది ఈ రెండు పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో పెట్టుబడి కాదు కదా కనీసం కూలీల ఖర్చుల కూడా రాని దుస్థితిని రైతులు ఎదుర్కొన్నారు. అధిక ధర వస్తుందని ఇప్పటికీ కొంతమంది రైతులు కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేసి ఉంచారు. మరోవైపు పొగాకు పరిమితికి మించి సాగు చేయడంతో కంపెనీలు, ప్రైవేట్ వ్యాపారాలు కొనలేమంటూ చేతులెత్తేశారు. కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారే తప్ప వారికి న్యాయం జరగలేదు. ఇటువంటి పరిస్థితులలో మళ్లీ సంప్రదాయ పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాలో 2025 ఖరీఫ్‌లో పత్తి పంట సాధారణ సాగు 91,566 ఎకరాలుగా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. జిల్లాలో గత గురువారం నాటికి 1,83,838 ఎకరాలలో పత్తి పంట సాగు చేశారు. ఇదే సమయానికి గతేడాది జిల్లాలో కేవలం 1,43,810 ఎకరాల్లో సాగు చేశారు. అంటే సుమారు 40 వేల ఎకరాల్లో అదనంగా ఈ ఏడాది పత్తి పంటసాగు చేశారు. పూర్తిస్థాయిలో ఈ క్రాప్ నమోదు చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. పత్తికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.8,110 మద్దతు ధరగా ప్రకటించింది. ఇది గతేడాది ప్రకటించిన రూ.7,521 పోల్చితే ఇది రూ.589 అదనం.