
బార్‌ల దరఖాస్తుకు స్పందన నిల్
జిల్లాలో 30 బార్ లైసెన్స్‌లకు రీనోటిఫికేషన్
దరఖాస్తులకు 14వ తేదీ చివరి గడువు
వ్యాపారుల నుంచి స్పందన లేక
17 వరకు పొడిగింపు
అధికారులకు తలనొప్పిగా మారిన బార్ లైసెన్స్‌ల వ్యవహారం
ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు రాని వ్యాపారులు
నరసరావుపేటటౌన్: బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ల వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. బార్ లైసెన్స్ నిర్వాహణకు మొదట ప్రభుత్వం రెండుసార్లు అవకాశం ఇచ్చింది. రెండోసారి పిలిచి న రీనోటిఫికేషన్‌కు స్పందన లేకపోవటంతో గడువును మరోమారు పెంచింది. కూటమికి చెందిన మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఇతరులు ఎవరూ దరఖాస్తు చేయకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ పార్టీ నాయకులు మినహా ఆసక్తిగల వారెవరూ దరఖాస్తు చేయటానికి సాహసించలేదు. తొలి విడత రెండుసార్లు అవకాశం ఇవ్వగా 40 శాతం దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు అందాయి. దీంతో రెండోవిడత ఈ నెల 3వ తేదీన తిరిగి ప్రభుత్వం రీనోటిఫికేషన్ ఇచ్చింది.
18న లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు
పల్నాడు జిల్లాలో ఓపెన్ క్యాటగిరీ 49, గీత కులాలకు సంబంధించి 5, మొత్తం 54 బార్ అండ్ రెస్టారెంట్‌లకు తొలివిడత నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 19 బార్ అండ్ రెస్టారెంట్‌లకు మాత్రమే నిర్వాహకులు ముందుకు రాగా మిగిలిన 30 బార్‌లకు ప్రభుత్వం తిరిగి గెజిట్ విడుదల చేసింది. నరసరావుపేటలో 8, చిలకలూరిపేటలో 7, పిడుగురాళ్లలో 6, మాచర్లలో 3, వినుకొండలో 6 బార్‌లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా ప్రకటించింది. ఆశించిన మేర దరఖాస్తులు అందకపోవటంతో గడువును 17వ తేదీ వరకు పొడిగించారు. 18వ తేదీన కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన దుకాణాలు కేటాయిస్తారు. ఒక్కో బార్‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 4 దరఖాస్తులు అందితేనే లాటరీ ప్రక్రియ ముందుకు సాగుతుంది. 30 బార్ అండ్ రెస్టారెంట్‌లకు సుమారు 120 పైగా దరఖాస్తులు అందాల్సి ఉంది. ఇప్పటి వరకు 8 దరఖాస్తులు మాత్రమే అందాయి.