
పీఆర్సీ కమిషన్ వేయకపోవడం మోసగించటమే
● ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
మక్కెన శ్రీనివాసరావు
● సత్తెనపల్లిలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శన
సత్తెనపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ వర్తింపజేయాల్సి ఉండగా సమయం దాటి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు పీఆర్సీ కమిషన్‌ను నియమించక పోవడం ఉద్యోగులను మోసగించటమేనని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలు పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిరసన వారం 5వ రోజు కార్యాచరణలో భాగంగా సత్తెనపల్లి మండల పరిషత్ కార్యాలయం నుండి సోమవారం ర్యాలీగా వెళ్లి తాలూకా కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనకు ఏపీటీఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ మొహమ్మద్ ఇబ్రహీం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఉద్యోగుల సొమ్ము 10 శాతాన్ని పెట్టుబడి దారులకు దోచిపెట్టే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మెమో నంబర్ 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకుంటే కలిసొచ్చే సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు బాళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు వెంటనే విడుదల చేయాలని, బోధనేతర యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ హెల్త్ ప్రీమియం చెల్లిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, పరీక్షలలో అసెస్మెంట్ బుక్‌లెట్ విధానం వలన ఉపాధ్యాయుల బోధన సమయం హరించడమే కాకుండా పిల్లలకు ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పారు. అసెస్మెంట్ బుక్ లెట్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాలూకా పరిధిలోని మండలాల ఏపీటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు శివారెడ్డి, ఫిరోజ్ ఖాన్,ఽ దర్మారావు, ఐతమ్‌రాజు,రవికుమార్, శ్రీధర్, సుభాని, సాబీర్, చంద్రం,రమేష్,రామకృష్ణ, హఫీస్, కోటేశ్వరరావు, సునీల్, వెంకటేశ్వరరావు వినోద్, సమద్ ఖాన్, నాసరయ్య, సుబ్బారెడ్డి, ఇలియాస్, శేషగిరి, అత్తరున్నీసా, లెనీన్‌రాణి, శ్రీదేవి, తులసి, కుదిషియా పాల్గొన్నారు.