
సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు
ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ. 64.50 లక్షలు కాజేత ముంబై కేంద్రంగా వ్యవహారం నడిపిన సైబర్ నేరగాళ్ల ముఠా ఐటీ యాక్ట్ కింద సత్తెనపల్లి టౌన్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు
సత్తెనపల్లి: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రూ. 64.50 లక్షలు పోగొట్టుకున్నారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌నగర్‌కు చెందిన కట్టెబోయిన కోటేశ్వరరావు అచ్చంపేట మండలం కొండూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండ్ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్నాడు. ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు ఆశ చూపడంతో కోటేశ్వరరావు వారి వలలో చిక్కుకున్నాడు. మార్చి 10న వాట్సాప్ నుంచి వచ్చిన లింకును ఓపెన్ చేయటంతో ఎఫ్ 979 2025 ఫార్చ్యూన్ గేట్ అనే గ్రూపులో సభ్యుడిగా చేర్చినట్లు మెసేజ్ వచ్చింది.
అలాగే ఓ మొబైల్ యాప్‌ను స్టాక్ మార్కెట్ కోసం డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. జూలై నుంచి ఆగస్టు 29 వరకు విడతల వారీగా రూ.10 వేల నుంచి ఆరంభమై నగదు జమ చేశారు. తన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయుని అయిన అనూష ఖాతా నుంచి, స్నేహితుడి భార్య ఖాతా నుంచి కూడా నగదు పంపారు. మొత్తం రూ. 64,50,199 బదిలీ చేశారు. నగదు పెట్టుబడి పెట్టడమే తప్ప ఒక్క పైసా కూడా లాభం రాలేదు. తాను చెల్లించిన నగదు రిఫండ్ చేయాలని కోరగా ఒక రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చి చిరునామా పెట్టమని కోరగా ముంబైలో ఏంజల్ వన్ స్టాక్ బ్రోకర్ కార్యాలయం అంటూ చిరునామా ఇచ్చారు. అక్కడికి వెళ్లిన తర్వాత అది నకిలీ స్టాక్ బ్రోకర్ సైబర్ నేరగాళ్ల ముఠాగా తేలింది. ముంబై నుంచి తొమ్మిది సెల్ ఫోన్ నెంబర్ల నుంచి సైబర్ నేరగాళ్లు వ్యవహారం నడిపి నగదు కాజేశారు. మోసపోయిన కోటేశ్వరరావు సత్తెనపల్లి పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు తెలిపారు.