
రైతులపై సర్కార్ చిన్నచూపు
‘అన్నదాత పోరు’ పోస్టర్‌ను
ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే బొల్లా
రైతులను కూటమి ప్రభుత్వం
అన్నివిధాలుగా మోసం చేసిందని ధ్వజం
9న నరసరావుపేటలో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు
వినుకొండ: అన్నదాతలకు అండగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన నరసరావుపేటలో ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను అన్నివిధాలుగా మోసగించిందని మండిపడ్డారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం అన్నదాత పోరు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో యూరియా కొరతపై, ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై 9వ తేదీన నరసరావుపేటలో నిరసన ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం
యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని, కనీస మద్దతు ధర కల్పించడంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ఆది నుంచి చంద్రబాబు వ్యవసాయం దండగ అని చెబుతున్నారని, రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా కోసం రోడ్డెక్కడం, క్యూలైన్‌లలో వేచి ఉండటం వంటి దుస్థితి నెలకొందన్నారు. కొంత మేరకు పంపిణీ చేసి, అసలు ఎక్కడా కొరత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతల కమీషనుతో బ్లాక్‌లో రూ.700 వరకు యూరియా బస్తా విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. టీడీపీ నేతలు రేషన్ బియ్యం, ఇసుక, మద్యంతోపాటు యూరియాను కూడా వ్యాపారంగా చేసుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో భేష్...
వైఎస్ జగన్ పాలనలో ఆర్బీకేల ద్వారా యూరియా, ఇతర ఎరువులను రైతులకు సరిపడా సకాలంలో అందించారని బొల్లా గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రం యూరియా బస్తా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలో అన్నదాతల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే మిర్చి, పొగాకు, మామిడి, పత్తి, ఉల్లి రైతులు అల్లాడుతున్నారని గుర్తుచేశారు. దీనిపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే... కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు చెబుతోందని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యమని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. అప్పటివరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.