
అన్నదాతలను ముంచుతున్న ప్రభుత్వం
అన్నదాతలకు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి సర్కార్
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల
9న ‘అన్నదాత పోరు’ను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపు
గురజాల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులను నమ్మించి నట్టేట ముంచుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ నాయకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), బీసీ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీలతో కలిసి ఆయన స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
వైఎస్ జగన్ పాలనలో మేలు
గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులు వంటివి రైతులకు సకాలంలో సరిపడా అందించారన్నారు. సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైఎస్ జగన్ తన పాలనలో రైతులకు మేలు చేశారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కనీసం రైతులకు యూరియాను అందించడంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు సత్వరమే న్యాయం చేసేలా అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మంగళవారం జరిగే అన్నదాత పోరులో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం అన్నదాత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు వి. అమరారెడ్డి, పట్టణ కన్వీనర్ కె.అన్నారావు, బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా కాశీబాబు, వేముల చలమయ్య, మన్నెం ప్రసాద్, దేవండ్ల నారాయణ, వెంకట నారాయణ, మహంకాళి యఽశోద దుర్గ, కె. ఆదినారాయణ దత్తు, జక్కా సత్యనారాయణ, పరిమి శ్రీను తదితరులు పాల్గొన్నారు.