
అవే సమస్యలు– అవే అర్జీలు
నరసరావుపేట రూరల్: జిల్లా ఎస్పీ కార్యక్రమంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అర్జీదారుల సమస్యలను ఒపిగ్గా తెలుసుకొని స్థానిక పోలీసులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. ఆస్తి, కుటుంబ, ఆర్థిక పరమైన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. ఎస్పీ కార్యాలయం నుంచి వచ్చిన అర్జీల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అర్జీలను తీసుకొని పోలీసు స్టేషన్‌కు వచ్చే వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాయంత్రం రండి , రేపు రండి అంటూ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. న్యాయం చేయక పోగా స్టేషన్‌లో ఎదురవుతున్న అవమానాలతో అర్జీదారులు మనస్తాపం చెందుతున్నారు.
ప్రతి వారం వంద వరకు ఫిర్యాదులు..
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలను తెలియజేసేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు. ప్రతి వారం సుమారు వంద వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక్కడకు వచ్చిన ఫిర్యాదులు స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్‌కు పంపి అధికారులు కూడా చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక పోలీసు స్టేషన్‌లో న్యాయం జరగకపోతేనే ప్రజలు ఎస్పీ కార్యాలయానికి వస్తున్నారు. ఇక్కడకి వచ్చిన ఫిర్యాదులను తిరిగి అదే పోలీసు స్టేషన్‌కు పంపుతుండటంతో ప్రజలకు న్యాయం లభించడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చి అర్జీలు అందజేసినా ఫలితం లేకపోవడం పలు మార్లు తిరిగే ఓపిక లేక పలువురు న్యాయం కోసం దిక్కులు చూస్తున్నారు.
అవే సమస్యలు పునరావృతం..
పీజీఆర్‌ఎస్ ఆర్జీల పట్ల జిల్లాలోని పోలీసు అధికారులు ఆసక్తి చూపించడం లేదు. జిల్లా కార్యాలయం నుంచి వచ్చే అర్జీలపై నామమాత్రంగా విచారణ చేపడుతున్నారు. రెండు రోజులు అర్జీదారులను స్టేషన్ చుట్టూ తిప్పి విచారణ పూర్తయినట్టుగా వారి చేత సంతకం తీసుకొని పంపుతున్నారు. జిల్లా అధికారుల దృష్టిలో సమస్య పరిష్కారం అయినట్టు చూపుతున్నారు.
అర్జీదారులు మాత్రం తమ సమస్యకు పరిష్కారం దొరకపోవడంతో ఎస్పీ కార్యాలయానికి అవే సమస్యలతో వస్తున్నారు.
కొంత మంది అర్జీదారులు మూడు, నాలుగు సార్లు ఎస్పీ కార్యాలయానికి వచ్చినా న్యాయం లభించని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పోలీసుల తీరుపైన, ప్రభుత్వ తీరుపైన మండిపడుతున్నారు. సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని పోలీసులను కోరుతున్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని మాటలు చెప్పడం తప్ప ఆచరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీజీఆర్‌ఎస్ అర్జీల పట్ల పోలీసు అధికారుల నిర్లక్ష్యం జిల్లా ఎస్పీకి అందుతున్న ఫిర్యాదుల్లో అధికశాతం పునరావృతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సడలుతున్న నమ్మకం

అవే సమస్యలు– అవే అర్జీలు