
అప్రమత్తతతో డెంగీకి చెక్
గుంటూరు మెడికల్: డెంగీ జ్వరం... ఈ మాట వినగానే జిల్లా ప్రజల్లో వణుకు పుడుతుంది. గతంలో అధికంగా కేసులు జిల్లాలోనే నమోదవ్వడంతో హెల్త్ ఎమర్జన్సీ సైతం ప్రకటించారు. డెంగీ జ్వరంతో మరణాలు కూడా సంభవించాయి. సాధారణంగా కొన్ని జ్వరాలు వచ్చిన కొద్దిరోజుల్లోనే తగ్గిపోతాయి. కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా వర్షాలు కురిసే సమయంలో జ్వరాలు వస్తుంటాయి. కానీ మండుటెండల్లోనూ కేసులు నమోదవ్వడంతో ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా సరైన అవగాహన లేకపోవడంతో పలువురు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్స్ పేరిట జ్వర బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డెంగీపై కొద్దిపాటి అవగాహనతో జాగ్రత్తలు తీసుకుంటే దాని బారిన పడకుండా ఉండొచ్చు.
ఇవీ.. లక్షణాలు
పగటి పూట కుట్టే ఎడిస్ ఈజిస్ట్ అనే దోమకాటు వల్ల డెంగీ జ్వరం వస్తుంది. వాంతులు, తలనొప్పి, కంటి గుడ్డు కదిలినప్పుడు నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతి అయినట్లు భ్రాంతి కల్గడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఒంటిపై ఎర్రటి గుల్లలు ఏర్పడతాయి. ప్లేట్‌లెట్స్ తగ్గిపోయి ఒక్కోసారి రక్తస్రావం జరుగుతుంది. ఎలీసా పద్ధతిలో రక్త పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారణ చేస్తారు.
అపోహలతో ప్రాణాల మీదకు..
డెంగీపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్స్ పేరిట రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కొంత మంది బొప్పాయి రసం తాగితే, బొప్పాయి తింటే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయనే అపోహల్లో ఉంటున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. డెంగీపై అవగాహనతో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే జ్వరం బారిన పడకుండా ఉండొచ్చు.
పట్టణాల్లో కేసులు అధికం
గ్రామీణ ప్రాంతాల్లో కంటే మున్సిపాలిటీలు, గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది గుంటూరు నగరంలో 31 కేసులు నమోదయ్యాయి. నగరంలోని భాగ్యనగర్, బొంగరాలబీడు , బృందావన్ గార్డెన్స్, గోరంట్ల, కోబాల్డ్‌పేట, గుండారావుపేట, గుంటూరువారితోట, శారదాకాలనీ, ఆర్.అగ్రహారం, వసంతరాయ పురం, శ్రీనివాసరావు తోట, పాత గుంటూరు, ఎన్‌జీఓ కాలనీ, మంగళదాస్ నగర్, లాంచెస్టర్‌రోడ్, ఐపీడీకాలనీ, గుంటూరువారితోట, లాలాపేట, తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో బాధితుల వివరాలు
సంవత్సరం బాధితుల సంఖ్య
2021 447
2022 168
2023 375
2024 432
2025 50 (జూన్ వరకు)
జిల్లాలో 50 కేసులు నమోదు అపోహలతో ప్రాణాలు పోయే ప్రమాదం కొద్ది జాగ్రత్తలతో జ్వరానికి అడ్డుకట్ట డెంగీ పేరుతో ప్రైవేటు వైద్యుల దోపిడీ
దోమలు పెరిగే ప్రదేశాలివీ..
మంచినీటిని నిల్వ చేసే ప్రదేశంలో, వాడి పారేసిన వస్తువులు, నిలువ ఉండే నీటిలో దోమ పిల్లలు పురుగుల మాదిరి కదులుతూ ఉంటాయి. నీటిని నిల్వచేసే డ్రమ్ములు, తొట్టెలు, గాబులు, రుబ్బురోళ్లు, వాడి పారేసిన టైర్లు, టీ కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, కొబ్బరి చిప్పలు, బొండాలు, ఫ్రిజ్, ఎయిర్ కూలర్ల వెనుక భాగాల్లో, పూల కుండీలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, నీటి సంపుల్లో ఈ దోమ లార్వాలు పెరుగుతాయి.

అప్రమత్తతతో డెంగీకి చెక్