
చదరంగంలో చిచ్చరపిడుగు
ఏడేళ్లకే జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్న బాలుడు
మాచర్ల రూరల్: పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లుగా ఈ చిన్నోడు చదరంగంలో ప్రతిభ చాటుతున్నాడు. ఎత్తు వేశాడంటే ప్రత్యర్థి చిత్తు కావాల్సిందే. మాచర్ల పట్టణంలో ఉంటున్న చదరంగం కోచ్ కటారపు కిరణ్, మధుమతి దంపతుల కుమారుడు జాషువా మ్యాగ్నస్ చిన్న వయసులోనే జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం 2వ తరగతి చదువుతున్నాడు.
చిన్ననాటి నుంచే..
తండ్రి నేర్పిన ఆటపై శ్రద్ధ పెట్టి నైపుణ్యాలను పెంచుకుంటూ జాషువా మ్యాగ్నస్ ప్రతిభ చాటుతున్నాడు. చిన్ననాటి నుంచే చక్కని సాధనతో ఆటపై పట్టు సాధించాడు. 2022లో తొలిసారిగా నాలుగేళ్ల వయసులోనే గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ –7 పోటీల్లో సత్తా చాటాడు. 2024లో ఆంధ్రా చెస్ శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో 3వ స్థానం సాధించాడు. నంద్యాలలో జరిగిన టోర్నమెంట్‌లో, గుంటూరులో రాష్ట్ర స్థాయి పోటీలలో మొదటి స్థానం కై వసం చేసుకున్నాడు. అండర్ –7 రాష్ట్ర స్థాయి పోటీల్లో 2వ స్థానం సాధించి ఏపీ నుంచి జాతీయ స్థాయికి ఎంపికై న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 2024 మైసూర్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో తొలి స్థానం పొందాడు. ఏడేళ్ల వయసులోనే వరుసగా జాతీయ స్థాయి పోటీలకు మూడుసార్లు ఎంపికై చరిత్ర సృష్టించాడు.
బాలుడు చదువు, చదరంగాన్ని సమన్వయం చేసుకునేలా కుటుంబం సహకారం అందిస్తోంది. ఎక్కడ పోటీలు జరిగినా కుటుంబం మొత్తం వెళ్లి ప్రోత్సహిస్తోంది. జాషువా మ్యాగ్నస్ సోదరుడు శాన్లీ కూడా చెస్ ఆటగాడే. ఇరువురు ఇంట్లో సాధన చేయటం పోటీలలో ఎంతగానో ఉపయోగపడుతోంది. అనారోగ్యం పాలైనా టోర్నమెంట్ ఆడిన రోజులు కూడా ఉన్నాయని తల్లిదండ్రులు తెలిపారు. ప్రముఖ చదరంగ క్రీడాకారుడు మ్యాగ్నస్ కార్లసన్‌పై అభిమానంతో జాషువా మ్యాగ్నస్ అని పేరు పెట్టామన్నారు. ఆ పేరుకు ఏ మాత్రం తీసిపోకుండా చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడీ చిన్నారి. గతేడాది పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డిలు జాషువా మ్యాగ్నస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. జనవరిలో జరిగిన అంతర్జాతీయ ఫిడే రేటింగ్ పోటీలలోనూ విజయం సాధించాడు. ఎప్పటికైనా మ్యాగ్నస్ కార్లసన్‌తో తలపడాలని ఈ చిన్నారి కోరిక. గ్రాండ్ మాస్టర్ కావటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు.
కుటుంబ ప్రోత్సాహంతో...

చదరంగంలో చిచ్చరపిడుగు

చదరంగంలో చిచ్చరపిడుగు