
వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం
తాడేపల్లి రూరల్ : మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్‌ఎస్‌ఆర్ ప్లాజాలో జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కూడారి తిరుపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వినియోగదారులు పడుతున్న సమస్యలకు పరిష్కారం, హక్కులపై ఫోరం అవగాహన కల్పిస్తోందని తెలిపారు. వినియోగదారులు తమకు జరిగిన నష్టంపై మంగళగిరిలో నూతనంగా ప్రారంభించిన జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు బొమ్ము జస్వంత్‌రెడ్డి, జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు టి.రవికుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రియారెడ్డి, యూత్ జిల్లా ఇన్‌చార్జి షేక్ రిజ్వాన్, యూత్ వింగ్ ప్రతినిధి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
యోగాలో లిమిట్‌లెస్ సెంటర్ విద్యార్థులకు పతకాలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ అమరావతి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్‌జీఓ కాలనీలోని సుమేధ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగసన పోటీల్లో తమ విద్యార్థులు పతకాలు సాధించారని యోగా టీచర్ వంగా వెంకటేష్ తెలిపారు. 10–14 ఏళ్ల వయస్సు విభాగంలో గోహితకు కాంస్యం, 18–28 ఏళ్ల విభాగంలో పి.భార్గవికి స్వర్ణం, కాంస్యం, 28–35 ఏళ్ల విభాగంలో వి.వెంకటేష్‌కు రెండు స్వర్ణాలు, 35–45 ఏళ్ల విభాగంలో రేణుక రెండు బంగారు పతకాలు సాధించారన్నారు. యోగాసనాలతోపాటు ఆహార అలవాట్లు మార్పు చేసుకుంటే చక్కని ఆరోగ్యం సొంతం అవుతుందని తెలిపారు. విజేతలకు, పోటీల్లో పాల్గొన్న వారికి లిమిటెస్ ఫిట్‌నెస్ సెంటర్ అధినేత నీలిమ అభినందనలు తెలిపారు.
వైభవంగా గిరిజా కల్యాణం
నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారంలోని శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం గిరిజా కల్యాణం వైభవంగా నిర్వహించారు. వామనాశ్రమ స్వామిజీ మాట్లాడుతూ గిరిజా కల్యాణం నిర్వహించడం వల్ల వివాహ దోషాలు తొలగిపోతాయని అన్నారు. త్వరగా పెళ్లిళ్లు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో త్వరగా పెళ్లిళ్లు కావాలని ఆశీర్వదించారు. గిరిజా కల్యాణాన్ని వేద పండితులు (శ్రీకాళహస్తి) శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం దాదాపు 200 మంది యువతీ, యువకులకు తీర్థప్రసాదాలు అందించారు. తటపర్తి రాంబాబు, నేరెళ్ల హరి, ఎల్‌ఎస్‌ఆర్ ఆంజనేయులు, గుడివాడ రవీంద్ర, కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ నిడమానూరు సురేష్, త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు.
582 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 582.90 అడుగులకు చేరింది. ఇది 291.3795 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 511, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 29,151, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 93,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం