
నకిలీ సర్వే సర్టిఫికెట్ సృష్టించిన వ్యక్తికి రిమాండ్
పెదకాకాని: ప్రభుత్వ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ సర్వే సర్టిఫికెట్ సృష్టించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెదకాకాని వెంగళరావునగర్‌కి చెందిన కూరాకుల సత్యన్నారాయణ, అనూష దంపతులు తమ ఇంటిని విక్రయానికి పెట్టారు. ఇంటిని కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చిన సత్యదేవ్ అనే వ్యక్తి బ్యాంక్ రుణం పొందేందుకు సర్వే సర్టిఫికెట్ కోరడంతో నకిలీ పత్రాన్ని ఆయన ఫోన్‌కు వాట్సాప్ ద్వారా పంపించారు. బ్యాంకర్లను కలిసిన ఆయన అనుమానం వచ్చి తహసీల్తార్ కృష్ణకాంత్‌ను పత్రం గురించి తెలిపారు. విచారణలో అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రం సృష్టించినట్లు నిరూపణ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సత్యన్నారాయణను గురువారం అరెస్టు చేశారు. కోర్టుకు హాజరు పరచగా, రిమాండ్ విధించినట్లు పెదకాకాని సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు.
టౌన్ హాలుకు ఘన చరిత్ర
బాపట్ల అర్బన్: అనాదిగా ఎన్నో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు బాపట్ల టౌన్ హాల్ పట్టుగొమ్మగా నిలిచిందని బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా అన్నారు. టౌన్ హాలు 120వ వార్షికోత్సవ కార్యక్రమంలో గురువారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ టౌన్ హాల్‌ను 1905 జూలై 17న అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ బ్రూడీ ప్రారంభోత్సవం చేశారన్నారు. టౌన్ హాల్‌కు 12 దశాబ్దాల చరిత్ర ఉందని తెలిపారు. ఎందరో జాతీయ నాయకుల ప్రసంగాలకు వేదికగా టౌన్ హాలు నిలిచిందని పేర్కొన్నారు. 1913లో ప్రథమాంధ్ర మహాసభ ఇక్కడే జరిగిందని తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకు ఇక్కడే బీజం పడిందని తెలిపారు. ఇది ఎందరో కవులు, కళాకారులకు ఆలంబనగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పి. సి. సాయిబాబు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ఏవీ రమణారావు, రచయిత మల్లికార్జున, ఖాజీపాలెం డిగ్రీ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ కృష్ణంరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.
విజ్ఞాన్ వర్సిటీకి రూ.58.27 లక్షల ప్రాజెక్ట్
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.ఆర్. చరణ్ రాజకు ఢిల్లీలోని ఏఎన్‌ఆర్‌ఎఫ్– పీఎంఈసీఆర్‌జీ (అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ – ప్రైమ్ మినిస్టర్స్ ఎర్లీ కెరియర్ రీసెర్చ్ గ్రాంట్) నుంచి రూ.58.27 లక్షల విలువ గల ప్రాజెక్టు మంజూరైందని వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్ గురువారం తెలిపారు. ‘‘స్టడీ ఆఫ్ యాంటీ– లీష్మానియల్ యాక్టివిటీ ఆఫ్ బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఐసోలేటెడ్ ఫ్రమ్ సీడ్స్ ఆఫ్ కారికా పపాయా అగెనస్ట్ లీష్మానియా డోనోవాని’’ అనే అంశంపై పరిశోధనకుగాను రాబోయే మూడు సంవత్సరాలకు ప్రాజెక్ట్ గ్రాంటు మంజూరైందన్నారు. ఎం.ఆర్. చరణ్ రాజను చైర్మన్ లావు రత్తయ్య, రిజిస్ట్రార్ పీఎంవీ రావు అభినందించారు.

నకిలీ సర్వే సర్టిఫికెట్ సృష్టించిన వ్యక్తికి రిమాండ్