
పెరిగిన వీధికుక్కల బెడద...
జిల్లాలోని పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కల బెడద ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాల్లో పొలాలకు వెళ్లి వచ్చే రైతులు, పట్టణ శివారు ప్రాంతాల్లో రాకపోకలు సాగించేవారు, ఇంటిముందు ఒంటరిగా ఆడుకునే చిన్నారులు, వాహనాలపై వెళ్లేవారు ఎవరు కనిపిస్తే వారిపై ఎగబడి రక్కేస్తున్నాయి. ఈ నెల 4న సత్తెనపల్లి వీరాంజనేయ నగర్‌లో దేశినేని అశోక్ అనే నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటన మరవక ముందే ఆదివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్తెనపల్లి నుంచి గుంటూరు వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడిని సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట వీధి కుక్కలు వెంబడించడంతో యువకుడు ప్రధాన రహదారిపై పడి పోయాడు. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో స్వల్ప గాయాలతో పెను ప్రమాదం నుంచి యువకుడు బయటపడ్డాడు. దీంతో వీధి కుక్కలు అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పిల్లలను ఒంటరిగా స్కూలుకు పంపించాలంటేనే వణికిపోతున్నారు.