
‘కూటమి’ దెబ్బకు రైతు కుదేలు
సత్తెనపల్లి: రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తం అవుతున్నారు. దుక్కులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సాగుకు సంబంధించిన పెట్టుబడి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో రైతులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రైతుకు రూ. 13,500 చొప్పున రైతు భరోసా మంజూరు చేయడంతో కొంత లబ్ధి చేకూరింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కంటే అదనంగా కొంత చేర్చి రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద అందిస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది.
నిధులు విడుదలవుతాయా?
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా రూ. 20 వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఏడాదైనా ఇంతవరకు పైసా కూడా ఇవ్వలేదు. రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో ప్రస్తుతం గ్రామాల్లో ఈ పథకానికి సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియ చేపట్టారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ లబ్ధి పొందడానికి సమీప రైతు సేవా కేంద్రాలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేదెన్నడో... అర్హులను గుర్తించి నిధులు విడుదల చేసేదెప్పుడో.. అని రైతులు తలలు పట్టుకుంటున్నారు.
భారంగా మారిన సాగు
విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటికేడు పెరుగుతున్నాయి. దుక్కి, కూలీల ఖర్చులు కూడా అమాంతం పెరిగాయి. వీటన్నింటిని దాటి పంటలను సాగు చేయాలంటే తగిన దిగుబడి చేతికి వస్తుందన్న ఆశ కూడా పూర్తిగా లేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా గతంలో కంటే తక్కువగా పంటలు సాగు చేస్తున్నారు.రైతులకు కూటమి ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం, పంట నష్టపోతే బీమా పరంగా అండ లభించడం లేదు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం గురించి కనీసంపట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఆర్థిక సాయం అందివ్వని ప్రభుత్వం
ఖరీఫ్ పెట్టుబడికి తప్పని పాట్లు
నగదు లేక కష్టపడుతున్న అన్నదాతలు
జిల్లాలవారీగా పరిస్థితి ఇదీ...
జిల్లా అర్హులైన రైతులు ఈకేవైసీ పూర్తి ఈకేవైసీ పెండింగ్
గుంటూరు 1,07,942 1,02,731 5,211
పల్నాడు 2,39,110 2,31,495 7,615
బాపట్ల 1,59,157 1,52,842 6,315