
కార్మికులకు తీరని ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వం
● సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు గుంటూరు విజయ్‌కుమార్ ● నేటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
సత్తెనపల్లి: కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాసి కార్మికులకు వ్యతిరేకంగా, యజమానులకు అనుకూలమైన 4 లేబర్ కోడ్‌లను తీసుకు వచ్చి కార్మికులకు తీరని ద్రోహం చేసిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు గుంటూరు విజయ్‌కుమార్ అన్నారు. సత్తెనపల్లిలో సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయకుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, పేదల వ్యతిరేక విధానాలను విడనాడాలని, రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని బుధవారం కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను అనుసరిస్తూ ప్రజలపై భారాలను మోపుతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కూడా కేంద్రంలోని బీజేపీకి వత్తాసు పలుకుతూ అవే విధానాలు అమలు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఈనెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, అసంఘటిత రంగ కార్మికులు, స్కీం వర్కర్లు బడుగు బలహీన వర్గాలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, కోపరేటివ్ బ్యాంక్, మార్కెట్ యార్డ్, యూనియన్ బ్యాంక్, అంగన్‌వాడీ కేంద్రాలు, కరూర్ వైశ్యా బ్యాంక్‌లను సందర్శించి కరపత్రాలు విస్తృతంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జి.మల్లేశ్వరి, పెండ్యాల మహేష్, అవ్వారు ప్రసాద్‌రావు, ఏ ఆంజనేయులు, ప్రజాసంఘాల నాయకులు కె దుర్గారావు, ఎ వీరబ్రహ్మం, జె రాజ్‌కుమార్, పి ప్రభాకర్, జి సుసలోన్, కె.జగన్, ఎం.రవికిరణ్, షేక్.మస్తాన్‌వలి, జి.యేసురత్నం, జి.మస్తాన్‌రావు, కె.సుధ తదితరులు పాల్గొన్నారు.