
ఒకే భూమిలో ఎన్నో సంపదలు
యడ్లపాడు: ఒకే పంట కాకుండా పలు అంతర పంటలు వేసినట్లయితే భూమికి అవసరమైన సూక్ష్మపోషకాలు పెరిగి ప్రధాన పంట దిగుబడి మెరుగవుతుందని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి పేర్కొన్నారు. మంగళవారం యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక రైతులు కుర్రా వేణు 22 ఎకరాల్లో సాగు చేస్తున్న 22 బహుళ పంటల్ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రసాయనాల వాడకాన్ని పూర్తిగా మానేసి, కషాయాలతో సాగు చేసే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు వివరించారు. అంతర పంటల ద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గి అదనపు ఆదాయం కూడా లభిస్తుందన్నారు. మహిళా రైతు కోటేశ్వరమ్మ అభ్యసిస్తున్న ఏటీఎం మోడల్ వ్యవసాయం గురించి వివరించారు. ఈ విధానంలో రోజూ కూరగాయలు, ఆకుకూరలు, దుంపజాతి పంటలు పండించడం ద్వారా కుటుంబానికి ఆహార భద్రత కలుగుతుందని, ఇంకా రసాయన రహిత పద్ధతిలో పండిన ఉత్పత్తులకు ధరలు కూడా ఎక్కువగా లభిస్తాయని పేర్కొన్నారు. ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు అవులు ఉండి అర్హులైతే ప్రభుత్వం రూ.50వేల ప్రోత్సాహకం అందిస్తుందని వెల్లడించారు. ఇందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజనన్‌లో పత్తి, వరి సాగు చేసే రైతులు ప్రకృతి పద్ధతులవైపు మొగ్గుచూపాలని సూచించారు. కార్యక్రమంలో కోటేశ్వరమ్మ, శ్రీనివాసరావు, పాములు సహా గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపాలి
ఆవులున్న రైతులకు రూ.50 వేలు ప్రభుత్వ ప్రోత్సాహకం